అప్పుడే తగినంత ఉపాధి
శ్రామికులకు నైపుణ్యాలను పెంచాలి
ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
న్యూఢిల్లీ : భారత్‌లో తగినంత ఉద్యోగులను సృష్టించడానికి ప్రస్తుత వృద్థి రేటు సరిపోదని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశానికి తగినంత ఉద్యోగాలను సృష్టించడానికి జిడిపి 8 శాతం కంటే ఎక్కువ వేగంతో విస్తరించాల్సిన అవసరం ఉందని విశ్లేషించారు. శుక్రవారం జరిగిన ఓ ఆన్లైన్ మీటింగ్‌లో రాజన్ మాట్లాడుతూ.. ''జనాభా అవసరాలు, ఉద్యోగాల ఆవశ్యకతను బట్టి భారత్ 8 శాతం నుంచి 8.5 శాతం వృద్థిని సాధించాలి. ఇతర దేశాలతో పోలిస్తే 6శాతం-6.5 శాతంతో ఆర్థిక వృద్థి బలంగా ఉంది. కానీ మన ఉద్యోగాల అవసరానికి సంబంధించి ఇది ఇప్పటికీ కొంత నెమ్మదిగా ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర చాలా మంది యువకులు ఉపాధి పొందవలసి ఉంది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ విస్తరణ ఎక్కువగా ఉన్నప్పటికీ.. దేశం ప్రతి సంవత్సరం శ్రామికశక్తిలో చేరే లక్షలాది మంది ప్రజలకు తగినంత ఉద్యోగాలను సృష్టించడం లేదు.'' అని రాజన్ అన్నారు.
ముంబయికి చెందిన పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం.. మొత్తం నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 10.05 శాతానికి పెరిగింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. హెచ్ఎస్బిసి అంచనా ప్రకారం దేశం రాబోయే 10 సంవత్సరాలలో 7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించవల్సి ఉంటుంది. 7.5 శాతం వృద్థితో ఉద్యోగాల సమస్యలో మూడింట రెండు వంతుల సమస్య మాత్రమే పరిష్కరించబడుతుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రధాని మోడీకి అధిక నిరుద్యోగం ప్రధాన సవాల్‌గా నిలువనుంది. చైనా, వియత్నాంతో సహా ఇతర సమర్థవంతమైన ఉత్పాదక దేశాలతో పోటీ పడేలా భారత్ తన శ్రామికశక్తికి శిక్షణ ఇవ్వాలని రాజన్ సూచించారు. చిప్‌ల తయారీలో చైనా అద్బుతమైన ప్రగతిని కనబర్చుతుండగా.. భారత్ ఇప్పటికీ చాలా వెనుకబడి ఉందని రాజన్ పేర్కొన్నారు.