న్యూఢిల్లీ : దిగ్గజ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్ ఛైర్మన్ పవన్ ముంజల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో సోదాలు చేసిన ఇడి రూ. 24 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఢిల్లీలో పవన్ ముంజల్కు చెందిన మూడు స్ధిరాస్తులను పిఎంఎల్ఎ నిబంధనల కింద స్వాధీనం చేసుకుంది. పవన్ ముంజాల్ సహా ఇతరులు భారత్ నుంచి విదేశీ నగదును అక్రమంగా తరలించారనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) ఫిర్యాదు ఆధారంగా ఇడి దర్యాప్తు చేస్తోంది. ఇంతక్రితం ఆగస్ట్ 1న కూడా ఇడి పవన్ ముంజల్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసి రూ.25 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో సీజ్ చేసిన మొత్తం ఆస్తులు రూ.50 కోట్లకు చేరాయి.