న్యూఢిల్లీ : టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్ లింక్‌కు భారత్‌లో త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉందని సమాచారం. దేశంలో శాటిలైట్ ఆధారిత వాయిస్, డేటా కమ్యూనికేషన్ సేవల ప్రారంభం కోసం స్టార్ లింక్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కొన్ని నెలల క్రితమే టెలికం శాఖకు దరఖాస్తు చేసుకుంది. కాగా.. డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ ప్రమాణాల విషయంలో టెలికం శాఖ పెట్టిన పలు షరతులు, నిబంధనలకు తొలుత స్టార్ లింక్ విముఖత చూపించడంతో ఆ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా.. స్టార్ లింక్ ఇచ్చిన వివరణలకు ప్రభుత్వం సంతృప్తి చెందిందని రిపోర్టులు వస్తున్నాయి. స్టార్ లింక్‌కు ఒకవేళ అనుమతులు మంజూరు అయి తే రిలయన్స్ జియో స్పేస్ ఫైబర్, ఎయిర్టెల్ వన్ వెబ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు తీవ్ర పోటీని ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు అమెజాన్ కూడా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దరఖాస్తు చేసుకుని ఉంది.