తిరువనంతపురం : అంతరిక్ష పరిశోధనలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలు సాధిస్తోంది. మొన్న చంద్రయాన్ -3, నిన్న సన్ మిషన్ ఆదిత్య ఎల్ - 1 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ విజయంలో కేరళ పిఎస్‌యుల భాగస్వామ్యం కూడా ఉంది. కేరళకు చెందిన నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు కెల్ట్రాన్, స్టీల్ అండ్ ఇండిస్టీయల్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ (ఎస్‌ఐఎఫ్‌ఎల్), ట్రావెన్కోర్ కొచ్చిన్ కెమికల్స్ (టిసిసి), కేరళ ఆటోమొబైల్స్ లిమిటెడ్ (కెఎఎల్) ఈ నాలుగు పిఎస్‌యులు దేశీయంగా అభివృద్ధి చేసి తయారుచేసిన వివిధ ఉత్పత్తులను ఆదిత్య ఎల్ -1 మిషన్‌లో ఉపయోగించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి పి. రాజీవ్ తెలిపారు. తాజాగా ఆయన చారిత్రాత్మక ప్రయోగాలైన చంద్రయాన్ - 3, ఆదిత్య ఎల్ -1 ప్రయోగాలు విజయవంతమవడానికి కేరళ పిఎస్‌యులు ఎంతో దోహదపడ్డాయని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఉపయోగించే పిఎస్ఎల్వి-సి57 లాంచ్ వెహికల్లో కేరళ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెల్ట్రాన్) తయారుచేసిన 38 ఎలక్ట్రానిక్ మాడ్యూళ్లను ఉపయోగించినట్లు మంత్రి రాజీవ్ తెలిపారు. దానితోపాటు మిషన్‌కు అవసరమైన వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ మోడళ్లకు టెస్టింగ్ సపోర్టును కూడా కెల్ట్రాన్ అందించిందని రాజీవ్ చెప్పారు. ఆదిత్య ఎల్ -1 లాంచ్ వెహికల్లోని వివిధ దశలకు సంబంధించిన ఫోర్జింగ్‌లను ఎస్‌ఐఎఫ్‌ఎల్ దేశీయంగా అభివృద్ధి చేసినట్లు ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. లాంచ్ వెహికల్ ప్రొపెల్లర్ ట్యాంక్, ఇంజన్ రాకెట్ బాడీ కోసం అనేక ఇతర ఫోర్జింగ్‌లు, వాటి భాగాలను కూడా ఎస్‌ఐఎఫ్‌ఎల్ అభివృద్ధి చేసింది. ఈ మిషన్‌లో కెల్ట్రాన్, ఎస్ఐఎఫ్ఎలతోపాటు టిసిసి కూడా కీలక పాత్ర పోషించిందని మంత్రి చెప్పారు. సన్ మిషన్ ప్రాజెక్టుకు సంబంధించిన 150 మెట్రిక్ టన్నుల సోడియం క్లోరేట్ క్రిస్టల్స్‌ను ప్రభుత్వ యాజమాన్యంలోని కెమికల్ కంపెనీ సరఫరా చేసింది. అవి మాత్రమే కాకుండా రాకెట్ యొక్క ఉపగ్రహ విభజన వ్యవస్థకు అవసరమైన వివిధ భాగాలను కెఎఎల్ సరఫరా చేసిందని రాజీవ్ తన పోస్ట్‌లో తెలిపారు.
కాగా, ఆదిత్య ఎల్ -1 ప్రయోగానికి మాత్రమే కాదు.. చంద్రయాన్ -3 మిషన్ కూడా కేరళ పిఎస్‌యుల సహకారం ఉందని మంత్రి రాజీవ్ తెలిపారు. చంద్రయాన్ -3 మిషన్‌లో కేరళకు చెందిన ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు, 20 ప్రైవేట్ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. కేరళకు చెందిన కెల్ట్రాన్, కెఎంఎంఎల్, ఎస్‌ఐఎఫ్‌ఎల్, టిసిసి, కెఎఎల్, స్మాల్ ఇండిస్టీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు (ఎస్ఐడిసిఓ) చంద్రమిషన్కు సహకరించాయి. కెఎంఎంఎల్ చంద్రయాన్ 3 మిషన్ యొక్క ఇంజన్ భాగాల కోసం కీలకమైన టైటానియం స్పాంజ్ మెటల్‌ను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించింది. దేశంలో టైటానియం సరఫరా చేసే ఏకైక సంస్థ కెఎంఎంఎల్నే కావడం విశేషం.