Aug 31,2023 07:08
  •  సిడబ్ల్యుఎంఎ ఆదేశాలను పాటించిన కర్ణాటక

మైసూర్‌ : కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (సిడబ్ల్యూఎంఎ) అదేశాలకు అనుగుణంగా కర్ణాటక తన రిజర్వాయర్ల నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయడం ప్రారంభించింది. మాండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర్‌ (కెఆర్‌ఎస్‌) రిజర్వాయర్‌ నుంచి, మైసూర్‌ జిల్లాలోని కబిని రిజర్వాయర్‌ నుంచి అవుట్‌ ఫ్లోను పెంచింది. మంగళవారం రాత్రి నుంచి అవుట్‌ ఫ్లోను పెంచినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నాటికి వీటి నుంచి తమిళనాడుకు 6,398 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. సెప్టెంబరు 12 వరకూ అంటే 15 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కర్ణాటకను సిడబ్ల్యూఎంఎ మంగళవారం ఆదేశించింది. తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే ఆందోళనలు నిర్వహిస్తామని రైతు సంఘాలు హెచ్చరించినా, కర్ణాటక ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కావేరీ జల వివాదం కేసు విచారణ ఈ వారంలో సుప్రీంకోర్టులో జరగనుంది. ఈ నేపథ్యంలోనూ నీటిని విడుదల చేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కావేరీ రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. కెఆర్‌ఎస్‌ రిజర్వాయర్‌ వద్ద బుధవారం నాటికి నీటిమట్టం 101.58 అడుగులుగా ఉంది. గత ఏడాది ఇదే రోజుకు 123.92 అడుగుల నీటి మట్టం ఉంది.