న్యూఢిల్లీ : చంద్రయాన్-3 కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి, అన్ని వ్యవస్థలు సాధారణంగా ఉన్నాయని గురువారం తెలిపింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞా రోవర్ గురువారం తెల్లవారు జాము నుంచి చంద్రుడిపై తిరగడం ప్రారంభించినట్లు వెల్లడించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిముందే తీసిన చిత్రాలను ఇస్రో గురువారం విడుదల చేసింది. చంద్రయాన్-3 గురించి ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ల్యాండర్, రోవర్ ప్రస్తుతం సక్రమంగానే పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే చంద్రుడిపై వాతావరణం లేనికారణంగా అంతరిక్షం నుంచే వచ్చే గ్రహ శకలాలు, ఇతర వస్తువులు ఈ రెండిండిని ఢీకొనే ప్రమాదం ఉందని తెలిపారు. కాగా, చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంగా ఇస్రో బృందాన్ని అభినందించడానికి ఈ నెల 26న బెంగళూరుకు ప్రధానమంత్రి మోడీ రానున్నారు.