Sep 04,2020 20:04

చైనీస్‌ యాప్‌ల నిషేధం

* భారత్‌కూ నష్టమే: చైనా


న్యూఢిల్లీ, బీజింగ్‌ : నూటపద్దెనిమిది చైనీస్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడం పై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) నిబంధనలకు, అంతర్జాతీయ వాణిజ్యం, ఈకామర్స్‌ నియమాలకు విరుద్ధమని పేర్కొంది. 'జాతీయ భద్రత పేరుతో చైనా కంపెనీలను నిందించడం, చైనీస్‌ యాప్‌లను వివక్షాపూరితంగా నిషేధించడం భారత్‌కూ మేలు చేకూర్చదు' అని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జీ రాంగ్‌ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు ముప్పుగా పరిగణిస్తూ పబ్జీ, టిక్‌టాక్‌తో సహా 118 చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్‌లోని మార్కెట్‌ పోటీకి, వినియోగదారుల ప్రయోజనాలకు ఇది శరాఘాతంగా పరిణమిస్తుందని జీ రాంగ్‌ పేర్కొన్నారు. భారత్‌లో అధిక సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉన్న ఈ యాప్‌లను భారత చట్టాలు, నిబంధలనకు లోబడే చైనీస్‌ కంపెనీలు నిర్వహిస్తున్నాయన్నారు. భారత్‌లోని పారిశ్రామికవేత్తలు, తయారీదారులకు, వినియోగదారులకు ఈ యాప్‌లు సమర్థవంతమైన, వేగవంతమైన సేవలు అందిస్తున్నాయన్నారు. యాప్‌లపై నిషేధం స్థానిక భారతీయ కార్మికుల ఉపాధిపైనే కాక, భారతీయ వినియోగదారులు, అనేక మంది సృజనాత్మక నిపుణుల, వ్యాపారవేత్తల జీవనోపాధిపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. భారత్‌-చైనా ఆర్థిక వాణిజ్య సహకార సంబంధాలు పరస్పర ప్రయోజనకరమైనవన్న విషయాన్ని భారత్‌ గుర్తిస్తుందని తాము భావిస్తున్నానమన్నారు. అన్ని పెట్టుబడులను, సేవలను సమంగా చూడడం, న్యాయమైన అవకాశాలు కల్పించడం, ఇరు పక్షాల మౌలిక ప్రయోజనాలు, ద్వైపాక్షిక సంబంధాల మౌలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని జీ రాంగ్‌ సూచించారు.
ఈ చర్య భారత్‌కు మేలు చేకూర్చదు : చైనా విదేశాంగ శాఖ
'అంతర్జాతీయ మార్కెట్‌ నియమాల ప్రకారం చైనా పారిశ్రామికవేత్తలతో సహా భారత్‌లోని చైనీస్‌ వ్యాపారాలతో సహా అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను, చట్టబద్ధమైన హక్కులను మార్కెట్‌ సూత్రాల ఆధారంగా పరిరక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుతంపై ఉంది' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యాప్‌ల నిషేధంపై ఆయన స్పందిస్తూ,. భారత్‌-చైనా మధ్య ఆచరణాత్మకమైన సహకారం ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనాన్ని కలిగిస్తుందని, అందులో ఉద్దేశపూర్వకమైన జోక్యం భారత్‌కు ఏమాత్రం మేలు చేకూర్చదని లిజియాన్‌ పేర్కొన్నారు. .