న్యూఢిల్లీ : ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో.. వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ మొత్తంగా దట్టమైన పొగమంచు అలుముకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) 346 (తీవ్రమైన) వద్ద ఉందని కేంద్ర వాయు కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) తెలిపింది. ఢిల్లీలోని లోథి రోడ్, జహంగీర్ పురి, ఆర్కెపురంలతో పాటై ఐజిఐ విమానాశ్రయం (టి3) ప్రాంతాల్లో వాయు నాణ్యతా ప్రమాణం వరుసగా 438, 491, 486, 473గా కొనసాగుతున్నట్లు ప్రకటించింది. వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు లోథి రోడ్ ప్రాంతంలో మునిసిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి) ట్యాంకులతో నీటిని చల్లుతోంది. అలాగే ఉత్తరప్రదేశ్లోని నొయిడా, సెక్టార్ 62, సెక్టార్ 1, సెక్టార్ 116 ప్రాంతాల్లో తీవ్రమైన కేటిగిరీకి చేరుకుంది.
వాయు కాలుష్యం పెరగడంతో ప్రభుత్వ ఆరోగ్య భద్రత కోసం ఢిల్లీలో అత్యవసరం కాని నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో ఐదు రోజుల పాటు నిర్మాణ పనులను నిలిపివేయాల్సిందిగా బుధవారం ఢిల్లీ పర్యావరణ మంత్రి ప్రకటించారు. పొలాల్లో పంటవ్యర్థాల దగ్ధం, అననుకూల వాతావరణం కొనసాగుతున్నందున రానున్న రెండు వారాల్లో ఢిల్లీ- ఎన్సిఆర్ పరిధిలో కాలుష్య స్థాయిలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని, దీంతో దగ్గు, జలుబు, కళ్ల నుండి నీరు కారడం వంటి సమస్యలు పెరగడంతో రోగుల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. అన్ని వయస్సుల వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మాస్కులు వినియోగించాల్సి వుందని అపోలో ఆస్పత్రి వైద్యులు డా. నిఖిల్ మోడీ తెలిపారు.