Nov 16,2023 06:45
  • విజయవాడలో ఎర్రదండు కదం తొక్కింది. అసమానతలు లేని అభివృద్ధి కోసం నినదించింది.పేదల పట్ల, వెనుకబడిన ప్రాంతాల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసించింది. సిపిఎం పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మహాప్రదర్శనకు, బహింరగ సభకు జనం భారీగా తరలివచ్చారు. రెడ్‌డ్రస్‌ వాలంటీర్లు, సిపిఎం నేతలు, ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి ప్రజానీకం మహాప్రదర్శనలో పాల్గొనడంతో విజయవాడ ఎర్రసముద్రంలా మారింది. ఎక్కడ చూసినా ఎర్రజెండాలే కనిపించాయి. హోరెత్తిన ప్రజల నినాదాలే వినిపించాయి. రెండునెలలుగా సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సెమినార్లు, బస్సు యాత్రలు నిర్వహించి అభివృద్ధి చర్చల్లో ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి, దానికి అంటకాగుతున్న ప్రాంతీయ పార్టీల తీరును వారు ఎండగట్టారు.స్ఫూర్తిదాయకంగా సాగిన ప్రదర్శన అనంతరం బహిరంగ సభలో ప్రజాప్రణాళికను సిపిఎం నేతలు ఆవిష్కరించారు. ప్రజాప్రణాళిక సాధనకు ఉద్యమాలే మార్గమని, ఆ దిశలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
  • దేశానికి మోడీ పీడ 

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : 
దేశానికి, రాష్ట్రానికి పట్టిన బిజెపి, మోడీ పీడను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని సిపిఎం పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి ఎవరు మద్దతిచ్చినా వారిని ఎన్నికల్లో ఓడించాలని ఉద్బోధించింది. ప్రజల పక్షమో, లేదంటే బిజెపి, మోడీ పక్షమో వైసిపి, టిడిపి, జనసేన తేల్చుకోవాలని డిమాండ్‌ చేసింది. తమ సొంత ఎజెండా, స్వప్రయోజనాల కోసం ప్రజలందరి ప్రయోజనాలను ఢిల్లీలో బిజెపి పెద్దల కాళ్లదగ్గర ఆ మూడు పార్టీలూ తాకట్టుపెట్టి సాష్టాంగపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ప్రజా ప్రణాళిక రూపొందించామని, దానిపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తామని, అమలు కోసం కలిసొచ్చే అందరినీ కలుపుకొని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ప్రకటించింది. 'అసమానతలు లేని అభివృద్ధి కోసం' అన్న నినాదంతో 'ప్రజారక్షణ భేరి' పేరిట నెల రోజులుగా సిపిఎం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ కలుపుతూ మూడు బస్సు జాతాలను విజయవంతంగా పూర్తి చేసింది. జాతాల ముగింపు అనంతరం విజయవాడలో బుధవారం భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించింది. బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఫుడ్‌ జంక్షన్‌ నుంచి సభా స్థలి సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు వేలాది మందితో సాగిన ర్యాలీ బెజవాడను ఎర్ర సముద్రం కావించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, ఎస్‌ పుణ్యవతి, సీనియర్‌ నాయకులు పి మధు, కార్యదర్శివర్గ సభ్యులు లోకనాథం, డి రమాదేవి, కె ప్రభాకర్‌రెడ్డి, వి వెంకటేశ్వర్లు, కిల్లో సురేంద్ర ప్రసంగించారు. ఈ సందర్భంగా సిపిఎం రూపొందించిన ప్రజా ప్రణాళికను సీతారాం ఏచూరి విడుదల చేశారు.

  • ఎర్ర జెండాతోనే దేశానికి రక్ష : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

లౌకిక ప్రజాస్వామ్యం రద్దు, దేశ సంపద లూటీ, సామాజిక న్యాయానికి తూట్లు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం, మొత్తంగా రాజ్యాంగమే మోడీ పాలనలో ధ్వంసం అవుతోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే... దేశ సమైక్యత, సమగ్రత ప్రమాదంలో పడింది. దేశ సంపద అదానీ, అంబానీ పరమవుతోంది. క్రోనీ కేపిటలిజం విశృంఖలమైంది. ఆర్థిక ఆత్మ సంతర్పణ జరుగుతోంది. పెద్ద పెద్ద వాగ్దానాల ప్రచారంతో ప్రజలను మోడీ భ్రమల్లో పెడుతున్నారు. జి20 దేశాల సదస్సులో భారత్‌ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందంటున్నారు. ఐదవ స్థానంలో ఉన్న మనం 2027 నాటికి మూడవ స్థానంలోకి ఎవరు ఉన్నా వస్తాం. ఎవ్వరూ ఆపలేరు. మనకు ఉన్న 140 కోట్ల జనాభా ఆ పని చేస్తారు. కానీ తలసరి ఆదాయంలో ప్రపంచంలో మనం 147వ స్థానంలో ఉన్నాం. జి20 దేశాల్లో అట్టడుగున ఉన్నాం. మానవాభివృద్ధిలో చివరిలో ఉన్నాం. నిరుద్యోగంలోనూ అంతే. సామాజిక న్యాయం విషయానికొస్తే మహిళలపై ప్రతిరోజూ 49 దాడులు జరుగుతున్నాయి. ప్రైవేటు మైనింగ్‌ కోసం గిరిజనులపై దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? బీమాకొరెగావ్‌ కేసులో ఏళ్లకు ఏళ్లు జైళ్లల్లో పెట్టారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు. గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లుగా పని చేస్తున్నారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు పాస్‌ చేసిన బిల్లులను ఆపొద్దని సాక్షాత్తూ సుప్రీం కోర్టు చెప్పింది. కేరళకు కేంద్రం రూ.పది వేల కోట్లు బకాయిలు చెల్లించట్లేదు. ఈ రోజు మరణించిన తమిళనాడు పార్టీ నేత శంకరయ్యకు ఆ రాష్ట్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ఇవ్వదలిస్తే గవర్నర్‌ సంతకం పెట్టలేదు. మీడియాపై దాడులు జరుగుతున్నాయి. ఇదీ మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, ఫెడరలిజం పరిస్థితి. ఎన్నికల కమిషన్‌ సైతం బిజెపికి అనుకూలంగా పని చేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పిఎం కిసాన్‌ డబ్బులు రైతులకు వేయడం మొదలు పెట్టారు. రూ.23 వేల కోట్ల అభివృద్ధి పథకాలు ప్రకటించారు మోడీ. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన అయినా ఇసి పట్టించుకోలేదు. ఉచిత రేషన్‌ కూడా దగానే. గతంలో ఐదు కిలోలు ఫ్రీగా, మరో ఐదు కిలోలు సబ్సిడీపై ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీపై ఇచ్చే ఆహార ధాన్యాలను ఎత్తేశారు...

  • ఆ పార్టీలే సమాధానం చెప్పాలి 

పదేళ్లల్లో బిజెపి ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ఇక్కడి వైసిపి, టిడిపి, జనసేన ప్రజలకు సమాధానం చెప్పాలని ఏచూరి డిమాండ్‌ చేశారు... విభజన చట్టం తెచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మద్దతు ఉండాలని చెప్పాం. మన్మోహన్‌సింగ్‌ ఐదేళ్లు ఇస్తామంటే, బిజెపి వెంకయ్యనాయుడు పదేళ్లన్నారు. పోలవరం, కడప స్టీల్‌ ఏమీ రాలేదు. పైగా వైజాగ్‌ స్టీల్‌ను కేంద్రం అమ్ముతోంది. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని నిలదీసి, ప్రజా ఉద్యమాలు నిర్మించి, ఒత్తిడి చేసే సత్తా ఒక్క ఎర్ర జెండాకే ఉంది. ఆ ఉద్యమాలకు అందరూ మద్దతివ్వాలి. బిజెపి ముందు సాగిలపడటానికి మోడీపై ప్రేమ అభిమానాలా, అర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతంపై వ్యామోహమా? లేదంటే ఇ.డి., సిబిఐ, వస్తాయని భయమా? ప్రజల వైపో, మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వైపో తేల్చుకోవాలి. వామపక్షాలకు సీట్లు లేవు, వాటి పనైపోయిందంటున్నారు. మా శక్తి ఏమిటో కాంగ్రెస్‌ ఎమర్జెన్సీ విధించినప్పుడు చూశారు. ఇటీవలి నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, దానికి కమ్యూనిస్టులు ఇచ్చిన మద్దతే సమాధానం. అందుకే వామపక్షాల, ప్రజా ఉద్యమాల అవసరం దేశానికి ఉంది. మోడీని గద్దె దిందించాలంటే ప్రజా ఉద్యమాలు రావాలి. 'ఇండియా' బ్లాక్‌ మరింత బలోపేతం కావాలి. ఈ రాష్ట్రంలో కూడా మోడీ, ఆయనకు మద్దతిచ్చే పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రజా ఉద్యమాల నిర్వహణకే ప్రజారక్షణ భేరి, ప్రజా ప్రణాళిక... అని చెప్పారు ఏచూరి.

  • బానిసత్వం వీడండి : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

రాష్ట్రానికి అన్యాయం, నష్టం చేసిన మోడీ సర్కారుకు ఇక్కడి బిజెపి, టిడిపి, జనసేన పల్లకీ మోస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగా బానిసత్వం చేయడం దేనికని ప్రశ్నించారు... ఇక్కడేమో ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటారు, కసిగా తిట్టుకుంటారు. ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలకు పూల గుత్తులిచ్చి ప్రసన్నం చేసుకుంటారు. ఇక్కడ బిజెపికి ఉనికి లేకపోయినా దేశంలోనే అత్యంత బలంగా ఉంది. పాతిక మంది ఎంపిలు పార్లమెంట్‌లో బిజెపికి చెయ్యెత్తుతున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన ముఖ్యమంత్రులు రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఎదిరించి పోరాడారు. ఇప్పుడున్నంత అధ్వానం ఎప్పుడూ లేదు. పిరికిపందల్లా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించలేరా? గాజాలో ఇజ్రాయల్‌ ఊచకోత కోస్తోంది. మోడీ సర్కారు మద్దతిస్తోంది. ప్రతి ఏడాదీ జగన్‌ జెరూసలేం వెళతారు. కనీసం బిజెపి వైఖరిపై మాట్లాడరా? బిజెపి, మోడీ, అమిత్‌షా అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేసే దమ్ము జగన్‌కు ఉంటుందా? అయినా బిజెపిని టిడిపి ఒక్కమాట అనకుండా, పైపెచ్చు కృతజ్ఞతలు తెలుపుతోంది. సిగ్గు లేదా? బిసి గర్జన సభలో మోడీ మూడోసారి రావాలన్నారు పవన్‌ కళ్యాణ్‌. ఏం చేశారని రావాలి, ఆయన అందచందాలకు ముగ్ధులయ్యారా? రాబోయే ఎన్నికల్లో మోడీ పీడ వదిలించుకోవాలి. మోడీకి గులాం చేసే వారినీ ఓడించాలి...

  • ఎర్ర జెండా ఎదిరిస్తుంది : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజలు, ప్రజా సమస్యలే ఎజెండాగా ఎర్రజెండా పని చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ... మాది ప్రజాపక్షం. ప్రజలకు అండగా నిలబడతాం. ప్రజా సమస్యలే లక్ష్యంగా ఉద్యమాలు నిర్మిస్తాం. నెల రోజులుగా నిర్వహించిన 'ప్రజా రక్షణ భేరి' బస్సు యాత్రల్లో ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రణాళిక ప్రకటించి, సాధన కోసం ప్రజలను విస్తృతంగా సమీకరిస్తాం. 'ప్రజారక్షణ భేరి' రాష్ట్రానికి దిక్సూచి. ప్రజా ప్రణాళికతో అసమానతలు లేని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఉద్యమాలతో ఒత్తిడి తెస్తాం. రాష్ట్ర రూపు రేఖలు మారుస్తాం. వెన్నుపోటుకు సజీవ ఉదాహరణ మోడీ. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన ఢిల్లీలో బిజెపి వద్ద సాష్టాంగపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాయి. ప్రజలను పట్టించుకోట్లేదు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసెంబ్లీలోనూ అదే తీరు. మోడీ అదే సిపిఎం శాసనసభ్యులు ఉంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. గతంలో ఎంత మంది ఉన్నారనే దానితో నిమిత్తం లేకుండా ప్రజల కోసం అసెంబ్లీలో పోరాడిన చరిత్ర ఉంది. అసెంబ్లీలో ఎర్రజెండా ప్రతినిధులుండాలి. కమ్యూనిస్టుల అవసరం ఉంది... సభా వేదికపై పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఆశీనులయ్యారు. తొలుత ఆహ్వానితులకు సిహెచ్‌ బాబూరావు స్వాగతం పలికగా, నగర నాయకులు డి కాశీనాథ్‌ వందన సమర్పణ చేశారు. సభకు ముందు ప్రజా నాట్యమండలి కళాకారులు, చిన్నారులు కళా ప్రదర్శనలిచ్చారు.

 praja-rakshana-bheri-public-meeting-in-vijayawada

 

praja-rakshana-bheri-public-meeting-in-vijayawada1