ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ వర్కర్స్, ఆయాల సమస్యలు పరిష్కారం కోసం డిసెంబర్ 8 నుంచి సమ్మె చేయనున్నట్లు ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. శనివారం ఐసిడిఎస్ పీడీ బి.శాంతకుమారికి సమ్మె నోటీసు అందజేశారు. ప్రధానంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని నాలుగున్నరేళ్లగా అనేక పోరాటాలు చేశామని, అయినా ప్రభుత్వం పరిష్కరించలేదని తెలిపారు. తెలంగాణ కంటే అదనంగా జీతం పెంచి ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, పెన్షన్‌తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు ఐదు లక్షలు, హెల్పర్‌కు మూడు లక్షలు ఇవ్వాలని, 300 జనాభా దాటిన మినీ వర్కర్‌ను మెయిన్ వర్కర్ గా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎఫ్‌ఆర్ ఎస్‌ఇ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తున్నామని, 20న ప్రాజెక్ట్ స్థాయిలో ధర్నా చేసి పిఒలకి వినతులు ఇస్తామని తెలిపారు.
సమ్మెకు ప్రజలు, లబ్ధిదారులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనసూయ, జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మీ, ప్రభ, కృష్ణమ్మ, సరళ, మంగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.