ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్‌లోని ఎల్వి ప్రసాద్ ఆస్పత్రిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుడికంటికి వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు. మూడు రోజుల క్రితం ఎల్వి ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించి క్యాటరాక్ట్ సర్జరీకి సిఫార్సు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం భువనేశ్వరితో కలిసి ఆయన ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సుమారు 40 నిమిషాల పాటు వైద్యులు సర్జరీ నిర్వహించారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా ముగిసినట్లు ఎల్వి ప్రసాద్ వైద్యులు తెలిపారు. సుమారు గంటసేపు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత చంద్రబాబును డిశ్చార్జి చేశారు. ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి ఆయన చేరుకున్నారు. బుధవారం మరోసారి ఆస్పత్రికి రావాలని వైద్యులు సూచించారు. మూడు నెలల క్రితం ఎడమ కంటికి కూడా ఎల్వి ప్రసాద్ ఆస్పత్రిలోనే ఆయనకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గత వారం హైదరాబాద్‌కు వచ్చారు. గచ్చిబౌలి ఎఐజి వైద్యులు చంద్రబాబుకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎఐజిలోనే ఆయన చర్మ సంబంధ చికిత్స తీసుకుంటున్నారు.