రేపు ఎల్వి ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో:మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఎఐజి) హైదరాబాద్లోని ఆస్పత్రిలో చేరారు. గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన చంద్రబాబుకు డాక్టర్ల బృందం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. డెర్మటాలజీ రిపోర్టులను నిశితంగా పరిశీలించిన అనంతరం వైద్యుల సూచన మేరకు ఆయన ఆస్పత్రిలో చేరారు. చంద్రబాబు వెంట కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణితో పాటు పలువురు టిడిపి ముఖ్య నేతలు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి అవుతారని టిడిపి వర్గాలు తెలిపాయి. కాగా, కుడి కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్న చంద్రబాబు శనివారం ఎల్వి ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. కుడి కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయాలని ఇప్పటికే వైద్యులు స్పష్టంచేసిన నేపథ్యంలో వైద్యులు చంద్రబాబుకు రెటీనా స్కానింగ్, కంటి కండరాల పరీక్షలు చేయనున్నారు. అనంతరం కుడి కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయనున్నారు.