జోహాన్నెస్‌బర్గ్ : విదేశీ జోక్యాన్ని, ఆంక్షలను వ్యతిరేకించడంలో, జాతీయ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో క్యూబాకు మద్దతు కొనసాగిస్తామని చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ ప్రకటించారు. అలాగే క్యూబా ఆర్థిక, సామాజికాభివృద్ధికి కూడా తమ వంతు మద్దతును అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 15వ బ్రిక్స్ సదస్సుకు హాజరైన నేపథ్యంలో క్యూబా అధ్యక్షులు మిగ్వెల్ డియాజ్ కేనల్తో జిన్‌పింగ్ బుధవారం భేటీ అయ్యారు. గత నవంబరులో క్యూబా నేత చైనాలో పర్యటించారని, కొత్త శకంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా విస్తరించుకోవడంపై స్థూల ఏకాభిప్రాయానికి వచ్చినట్లు జిన్‌పింగ్ గుర్తు చేసుకున్నారు. ఉభయ పక్షాల సంయుక్త కృషితో ఆ ఏకాభిప్రాయాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పరస్పర రాజకీయ విశ్వాసాన్ని మరింత పెంచుకోవడాన్ని, ఆచరణాత్మక సహకారాన్ని విస్తరించుకోవడాన్ని, వ్యూహాత్మక సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తామని అందుకోసం క్యూబాతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇరు పార్టీలు, ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల్లో పురోగతి కోసం కృషి చేస్తామని చెప్పారు. చైనాకు కీలక ప్రయోజనాలు కలిగిన అంశాల్లో చైనాకు గట్టి మద్దతును అందిస్తున్నందుకు క్యూబాను జిన్‌పింగ్ అభినందించారు. వర్ధమాన దేశాల మధ్య సహకారానికి జి 77, చైనా ఒక కీలక వేదిక అని జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. జి 77 దేశాల గ్రూపునకు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న క్యూబా, చైనా వర్ధమాన దేశాల ఐక్యతను పటిష్టపరిచేందుకు కృషి చేస్తాయని పేర్కొన్నారు.