పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పాములకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు. ఇవి భూచర సరీసృపాలు. ప్రపంచ వ్యాపితంగా దాదాపు 3000 జాతులున్నాయి. అంటార్కిటికాలో పాములుండవు. పాములకు బాహ్య చెవులు, ఇయర్ డ్రమ్ (టింపానిక్) ఉండవు. దాంతో పాములు వినలేవు. శరీర కణాల నుంచి భూ ప్రకంపనలు (సొమాటిక్ హియరింగ్) మాత్రమే గ్రహిస్తాయి. దానినే ఇప్పటివరకూ మనం నమ్ముతూ వచ్చాం. కానీ ఇటీవల జరిగిన పరిశోధనలలో గాలిలో ప్రయాణించే ధ్వని తరంగాలు కూడా పాము వినగలుగుతుందని పరిశోధనలలో తేలింది.
'పాములకు వెలుపలి చెవులు లేకపోయినా లోపలి చెవులు ఉంటాయి. వాటికి సన్నని రోమాలు ఉంటాయి. లోపలి చెవులు దవడ ఎముకలతో అనుసంధానించబడి ఉంటాయి. ఈ దవడ ఎముకలకు క్వాడ్రేట్, కొలుమెల్లా అనే చెవి ఎముకలు కలపబడి ఉంటాయి. వీటి ద్వారా భూ ప్రకంపనలను, కాక్లియా అనే నిర్మాణం ద్వారా గాలిలోని ధ్వని తరంగాలను గ్రహిస్తాయని తెలిసింది. పాము లోపలి చెవిలో ఉండే చిన్న రోమ కణాలలో కలిగే కంపనాలను ఈ ఎముకలు గ్రహిస్తాయి. ఈ కంపనాలు దవడ ఎముకల ద్వారా మెదడుకు ప్రయాణించే నరాలకు చేరడంతో, అవి ప్రేరణ చెంది.. మెదడుకు సిగల్స్ అందిస్తాయి' అని లోవెల్‌లోని మసాచుసెట్స్ విశ్వ విద్యాలయానికి చెందిన న్యూరోబయాలజిస్ట్ బ్రూస్ యంగ్ తెలిపారు.
ఎలక్ట్రోడ్స్‌తో..
డెన్మార్క్‌లోని ఆర్హస్ యూనివర్శిటీకి చెందిన జీవశాస్త్రవేత్త క్రిస్టియన్ క్రిస్టెన్‌సెన్ బాల్ పైథాన్ (పైథాన్ రెజియస్)ని అనే ఒక రకం పాముని పరిశీలించారు. 'ఎలుకలతో ప్రయోగాలు చేయాలంటే అవి ప్రయోగానికి అనుకూలంగా స్పందించడానికి వాటికి కొంత శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. కానీ పాములకు అలా శిక్షణ ఇవ్వలేము. వీటిపై పరిశోధనలు చాలా చాలా కష్టతరమైనవి' అని క్రిస్టెన్‌సెన్ చెప్పారు. పామును ఒక పంజరంలో బంధించి, స్పీకర్ ద్వారా శబ్దం (ధ్వని) వినిపిస్తాం. 'పరిశోధనలలో సరీసపాల తలలకు జోడించిన ఎలక్ట్రోడ్‌లను ఉపయోగించి, పాముల లోపలి చెవులను వాటి మెదడులకు అనుసంధానించే న్యూరాన్‌లు ఏ ఫ్రీక్వెన్సీలో ఎలా ప్రతిస్పందిస్తాయో గమనించాం' అని ఆయన వివరించారు. పాములు శబ్దాలకు బాహ్యంగా ప్రతిస్పందించవు. విద్యుత్ ప్రకంపనలను ప్రసరింపజేసినప్పుడు నాడుల ప్రతిస్పందనను గుర్తించి 80 నుంచి 160 హెర్ట్జ్ మధ్య పౌనఃపున్య స్థాయిలో అవి శబ్దాలను వింటాయని గుర్తించడం జరిగింది.
మిమిక్రీ కాంప్లెక్స్‌లా..
అంతేకాదు వాటికి అపాయం ఉందని గ్రహించినప్పుడు ప్రమాద సందర్భాలను బట్టి రకరకాల శబ్దాలను చేస్తూ రక్షణ మార్గాలను ఎన్నుకుంటాయని ఈ పరిశోధనలలో తేలింది. అలా శబ్దాలు చేయగలగటానికి పాములలో మల్టీ బాటేసియన్ మిమిక్రీ కాంప్లెక్స్‌లు ఉన్నట్లు గుర్తించారు.
'వాటికున్న రెండు రకాల వినికిడి మార్గాలను బట్టి, కొన్ని జాతులలో కొన్ని రకాల ఇంట్రాస్పెసిఫిక్ ఎకౌస్టిక్ కమ్యూనికేషన్ ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంటే శబ్దాలను గ్రహించిన వెంటనే ప్రమాదస్థాయిని బట్టి అవి తిరిగి శబ్దం చేస్తాయి. 'పాముల చర్మంలో కొన్ని ప్రత్యేక ఇంద్రియ అవయవాలు ఉన్నాయి. వాటి తల కంపనాలకు ప్రతిస్పందిస్తుందని, శరీరం పొడవునా ప్రకంపనలను గుర్తించే భాగాలున్నాయి' అని ఆయన చెప్పారు. 'అయితే కొన్ని పాములు భూప్రకంపనలను గ్రహించడంలో చురుగ్గా ఉంటే గాలిలో ధ్వని తరంగాలను గ్రహించే సామర్థ్యం తక్కువగా ఉంది. కొన్ని సాలమండర్లు, కప్పలు కూడా పాములలాగే వింటాయ'ని యంగ్ పేర్కొన్నారు.