Aug 20,2023 13:57

పూర్వం ఒక అడవిలో స్వప్నిక అనే కొంగ ఉండేది. అది ముసలిది అయిపోవడంతో ఆహారం సంపాదించడం కష్టం అయిపోయింది. అందుకు అది ఒక ఉపాయం ఆలోచించింది. బదరిక వనంలో కొల్లేరు అనే సరస్సు ఉంది. ఆ సరస్సు నిండా చేపలు ఉన్నాయి అని తెలుసుకుంది. ఆ సరస్సు దగ్గరకు చేరుకుంది ముసలి కొంగ. సరస్సు ఒడ్డున ఒంటికాలితో జపం చేయడం మొదలు పెట్టింది. ఆ సరస్సులోని చేపలు కొంగ చుట్టూ వచ్చి చేరాయి. అయినా కొంగ చేపలను చంపి, తినలేదు. అది చూసి చేపలకు ఆశ్చర్యమనిపించింది.
వెంటనే అవి 'కొంగా! నీకు మేము ఆహారం కదా.. పైగా నీకు అందుబాటులోనే నిలబడ్డాం. మమ్మల్ని తినవేంటి?' అని అమాయకంగా అడిగాయి.
అప్పుడు ఆ కొంగ 'ఓ నా చేప మిత్రులారా! నేను గంగానది ఒడ్డున మర్రిచెట్టు మీద కూర్చుని ఉన్నాను. ఆ చెట్టు కింద ఒక యోగి తన శిష్యులతో ధర్మాలను చెప్తూ, సకల ప్రాణుల యందు దయతో ఉంటేగాని, మోక్షం లభించదని చెప్పారు. అది విన్న నేను ఇకనుండి మీలాంటి జీవులను చంపి, తినకూడదని నిర్ణయించుకున్నాను' అని చెప్పింది.
చేపలు సంతోషించాయి. కొద్ది రోజులలోనే చేపలు, కొంగ మంచి మిత్రులు అయ్యాయి. ఒకరోజు ఉదయం చేపలు నీటిపైకి వచ్చేసరికి కొంగ ఏడుస్తూ కనబడింది. 'మిత్రమా! ఎందుకు ఏడుస్తున్నావ్‌?' అని అడిగాయి చేపలు.
'ఏమి చెప్పను మిత్రులారా! ఇప్పుడే చేపలు పట్టేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్లు ఈ సరస్సులో చాలా చేపలు ఉంటాయి. త్వరలో వచ్చి ఈ చేపలను పడదాం అనుకోవడం విన్నా!' అని చెప్పింది బాధగా.
చేపలన్నీ ఇప్పుడు ఎలా అని బాధపడసాగాయి. 'కొద్దిరోజుల్లోనే మనం మంచి మిత్రులమయ్యాం. కానీ త్వరలోనే మీరంతా చేపల వాళ్ళ వలలకి చిక్కుతారని తలచుకుంటేనే నా మనసుకి ఏదోలా అయిపోతుంది' అని దొంగ కన్నీరు కార్చింది కొంగ.
'కొంగ మిత్రమా! ఈ ఆపద నుండి నువ్వే మమ్మల్ని కాపాడాలి' అని ఒక చేప అంది.
'అయ్యో! నేను ముసలిదాన్ని. మిమ్మల్ని ఎలా రక్షిస్తాను? అయినా ప్రయత్నిస్తాను. ఇక్కడకు దగ్గరలోనే ఆ కొండలలో ఒక సరస్సు ఉంది. ప్రతిరోజూ మూడు చేపల చొప్పున ఆ సరస్సు దగ్గరకు చేర్చుతాను' అంది.
కొంగ మాటలకు చేపలు చాలా సంతోషించాయి. అప్పటినుండి ఆ కొంగ ప్రతిరోజూ మూడు చేపలను తన ముక్కుతో పట్టుకుని, వెళ్తూండేది. కొంతసేపటి తరువాత ఖాళీ నోటితో తిరిగి వచ్చి, తీసుకెళ్లిన చేపలన్నీ క్షేమంగా మరో సరస్సులో వదిలి వచ్చానని మిగతా చేపలకు చెప్పేది. ఇలా కొద్దిరోజులు గడిచిపోయాయి. సరస్సులోని చేపలు సగం వరకూ ఖాళీ అయిపోయాయి.
అదే సరస్సులో చతురుడు అనే ఎండ్రకాయ ఉంది. దానికి కొంగ మీద అనుమానం వచ్చింది. 'తీసుకెళ్ళిన చేపలను రక్షిస్తుందా.. భక్షిస్తుందా..?'అని.. తన అనుమానం చేపలకి చెప్పి, మరునాడు 'నేను కూడా కొంగతో వెళ్తా!' అంది. సరే అన్నాయి చేపలు.
'కొంగ మిత్రమా! ఈ రోజు నా వంతు. నన్ను తీసుకెళ్ళవా?' అంది ఎండ్రకాయ. ఆహా! రోజూ చేపలను తిని తిని విసుగేసింది. ఈరోజు ఎండ్రకాయతో నాకు విందు భోజనం అనుకుంటూ.. సరేనంది కొంగ.
అప్పుడు ఎండ్రకాయ 'కొంగ మిత్రమా! నన్ను నీ ముక్కుతో పట్టుకుంటే నా కాళ్లు నీ కళ్ళలో గుచ్చుకుంటాయి. నీకే ప్రమాదం. అందుకని నీ మెడను నేను పట్టుకుని ఉంటాను' అంది.
కొంగ సరే అంది. కొంతదూరం ప్రయాణం చేశాక ఎండ్రకాయ కిందికి చూస్తూ.. 'సరస్సు కొండ పక్కనే ఉంది అన్నావు కదా..! ఎక్కడా సరస్సు లేదే..?' అని అడిగింది. ఎన్నిసార్లు అడిగినా కొంగ మాట్లాడక పోయేసరికి, దాని అనుమానమే నిజమని ఎండ్రకాయ కొంగ మెడను కొరికేసింది.
కొంగ ప్రాణాలు వదిలి, కింద పడిపోయింది. ఎండ్రకాయ నెమ్మదిగా సరస్సును చేరి, చేప మిత్రులకు జరిగినదంతా చెప్పింది. 'చూశారా! మోసము ఎంత కాలమో దాగదు. తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలని తన్నేవాడు మరొకడుంటాడు' అనుకున్నాయి చేపలు.
అందుకే ఎవరినీ నమ్మించి మోసం చేయకూడదు. అలా చేస్తే కొంగలా దుష్ఫలితం అనుభవించాల్సి వస్తుంది.

బల్ల కృష్ణవేణి
9398905803