అది తెల్లవారుజాము సమయం. గూటిలోని కాకి నిద్రలేచి, చుట్టూ పరికించింది విసుగ్గా. గొంతు సవరించుకుని ్ల 'కావు.. కావు' మంది.
అది ఒక్కసారి చెవులు రిక్కించింది. పక్కనే ఎక్కడో ఒక కోకిల తీయని పాట పాడుతోంది. కొంచెం సేపు కాకి ఆ పాటని విని ఆనందించింది. తర్వాత వెర్రెత్తింది.
ఇది న్యాయం కాదు.. కోకిల పెట్టిన గుడ్డును తను వెచ్చగా పొదిగింది. ఇప్పుడు ఆ చిన్న పక్షి తనకన్నా ఎంతో బాగా పాడుతోంది.
కానీ.. తను అసూయ పడకూడదు. 'ఆ కోకిల దగ్గర పాడటం నేర్చుకోవాలి..' అనుకుంది కాకి.
కోకిలను వెతుక్కుంటూ కాకి వెళ్ళి, చివరకు దాన్ని చూసింది. కాకి వైపు కోకిల కొంచెం అనుమానంగా చూసింది. అయినా కానీ కాకి చాలా గౌరవంగా చూస్తూ.. 'నువ్వు నాకు పాడటం నేర్పిస్తావా?' వినయంగా అడిగింది.
'తప్పకుండా, కానీ ఒక షరతు మీద.. 'నువ్వు ప్రతిరోజూ ఇక్కడికి తెల్లవారు తుండగానే రావాలి!' అంది కోకిల. కాకి తలూపింది.
'సరే మంచిది. నీకు రేపటి నుండే పాఠాలు మొదలు' అని కోకిల తన పనులు చేసుకోవడానికి ఎగిరిపోయింది.
కాకికి నిద్ర అంటే చాలా ఇష్టం. సూర్యోదయానికి ముందు ఎప్పుడూ నిద్ర మేల్కొని ఎరుగదు. కానీ మర్నాటి ఉదయమే సంగీతం పాఠాలు మొదలవుతాయి! నిద్రపోయే ముందు గడియారాన్ని సరిచేసి, అలారం మోగగానే, కాకి మంచంలోంచి దూకి, కళ్ళు నులుముకుంటూ నిద్రని తరిమేసి, పాటలు నేర్చుకోటానికి పరిగెత్తింది.
అప్పటికే చాలాసేపటి నుండి కోకిల అసహనంగా ఎదురుచూస్తోంది. కాకి వచ్చి పక్క కొమ్మ మీద వాలిందో లేదో.. సంగీత పాఠం మొదలయ్యింది. 'ఇప్పుడు ఇలా నువ్వు పాడాలి..' అంటూ 'కుహూ.. కుహూ..' అంటూ కూసింది. కాకి ఉత్సాహంగా ప్రయత్నించింది. కానీ 'కా.. కా..' అని మాత్రమే అనగలిగింది. కొంచెంసేపటికి కోకిల విసిగి వేసారిపోయింది. 'నీకు సంగీతం నేర్పటం అసాధ్యం. నువ్వు వేరే గురువును చూసుకో!' అంటూ కోకిల ఎగిరిపోయింది. కాకి చాలా నిరుత్సాహపడింది. కన్నీరు కారుస్తూ తన గూటికి చేరుకుంది.
రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆకాశం నల్ల మబ్బులతో నిండటం కాకి చూసింది. చల్లని గాలి వీస్తూ సన్నని తుంపరతో వాన కురవటం మొదలుపెట్టింది. నెమలి తన అందమైన పింఛాన్ని విప్పి, నాట్యం చెయ్యటం తన గూటిలో నుంచి కాకి చూసింది. దానికి నాట్యం చేయాలనే కోరిక బలంగా కలిగింది. తన కోరిక తీరటంలో నెమలి సాయం చెయ్యగలదేమో అని ఆలోచిస్తూ.. నెమలిని కలవటానికి ఎగిరి వెళ్ళింది.
'నెమలీ! నువ్వు నాకు నాట్యం నేర్పగలవా?' అని అడిగింది కాకి.
'తప్పకుండా నేర్పుతాను.. నేను ఎలా చేస్తానో నువ్వు అచ్చం అలాగే చెయ్యి!' అంటూ తన పొడవాటి పింఛాన్ని పురి విప్పింది. కాకి మొదటిసారి ప్రయత్నించింది. కాకికి నెమలిలాగా పురివిప్పడం వీలు కావడం లేదు.
'నేను చేస్తున్నప్పుడు సరిగ్గా చూడు. నువ్వు చేస్తోంది సరికాదు..' అని చెప్పింది నెమలి. కాకి ప్రయత్నించింది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది. కానీ సరిగా చేయలేక పోయింది. నెమలికి చాలా కోపం వచ్చింది. 'నువ్వు ఎప్పటికీ నాట్యం నేర్చుకోలేవు' అని తిట్టి, అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కాకి చాలా చింతించింది. తనకు పాడటం రాదు, నాట్యం చెయ్యడం రాదు. ఒకవేళ తను అందమైన గూడు కట్టడం నేర్చుకోగలనేమో అని గిజిగాడి దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళింది కాకి. కానీ గిజిగాడు అసలు కాకి చెప్పేది వినిపించుకునే ధోరణిలోనే లేదు. 'నువ్వా? నువ్వు ఎప్పటికీ నా గూడులాంటివి కట్టలేవు' గర్వంగా అంటూ, కాకిని పంపేశాడు.
కాకి చాలా బాధపడింది. అసలు ఏ విషయంలో తాను గొప్పో ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ, తన గూటిలో నుంచి కిందికి చూస్తున్నప్పుడు, అక్కడున్న ఇంటి వెనకవైపు పెరట్లో ఒక అన్నం ముద్ద కనపడింది. పెద్దగా 'కావ్ కావ్' మని అరుస్తూ తన స్నేహితుల్ని, బంధువుల్ని విందుకు ఆహ్వానించింది. అన్నీ కలిసి కడుపునిండా అన్నం మెతుకులు తిన్నాయి.
అప్పుడు ఒక ఆలోచన వచ్చింది కాకికి. తను పాడలేకపోవచ్చు.. నాట్యం చెయ్యలేకపోవచ్చు.. అందమైన గూడు కట్టలేకపోవచ్చు.. కానీ తను ఆహారాన్ని చూసినప్పుడు, ఇతరులను పిలిచి, వాళ్ళతో ఆహారాన్ని పంచుకున్నట్టు మరే ఇతర పక్షి పంచుకుంటుంది? కోకిల కాదు, నెమలి కాదు, గిజిగాడు కానేకాదు. తనలాగా ఇతర కాకులు తప్ప, మరే పక్షి ఆ పని చెయ్యదు. తన గురించి తానే ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు కాకి చాలా సంతోషపడింది. అలాంటి మంచి బుద్ధిగల కాకి కుటుంబానికి చెందినందుకు గర్వపడింది.
కాకి చాలా సంతోషంగా ఉండటం చూసిన మిగతా కాకులు 'ఏంటి కాకి? త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నావా? ఏం..?' అంటూ ఆటపట్టించాయి. కాకి ముసి ముసిగా నవ్వుతూ 'కావ్.. కావ్..' అంటూ ఎగిరిపోయింది.
ఎస్. గాయత్రి
8వ తరగతి,ఎ.యు. హైస్కూల్,
విసిసి ట్యూషన్, పిఠాపురం కాలనీ సెంటర్.