చెన్నారెడ్డికి పుస్తకాలంటే అభిమానం. చిన్నప్పటి నుండీ బాగానే చదివేవాడు. అలా అని ఊరిలో ఉన్న.. లైబ్రరీకి వెళ్లి చదువుకోవడానికి తండ్రి విశ్వేశ్వరయ్య ఒప్పుకోలేదు. 'వాటిని ఎందరెందరో పట్టుకుంటారు. అందరికీ ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండవు. దానివలన మనకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంది. కాబట్టి, చదవాలనుకున్న పుస్తకాలు మనమే కొనుక్కుందాం' అంటూ కొన్ని పుస్తకాలు ఇంటికి తెప్పించేవాడు.
'మార్కెట్లోకి వచ్చిన అన్ని పుస్తకాలూ తెప్పించుకోలేము కద నాన్నా!' అనే వాడు చెన్నారెడ్డి.
అయినా సరే.. విశ్వేశ్వరయ్య తన అభిప్రాయం మార్చుకోలేదు. కొడుకు పుట్టినరోజుకు పుస్తకాలే బహుమతిగా ఇచ్చేవాడు.
తండ్రికి తెలీకుండా అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్లి చదువుకునేవాడు. ఆ పుస్తకంలో పాత్రలు సజీవంగా తన కళ్ళ ముందే తిరుగుతున్నట్లు, తనూ వాళ్లతో మమేకం అవుతున్నట్లు.. అనుకునేవాడు. ఈ క్రమంలో చెన్నారెడ్డి పెరిగి పెద్దవాడై మంచి చదువరిగా ఎదిగాడు. యాభై ఏళ్ల వయసు వచ్చేసరికి ఓ రెండు చెక్క బీరువాల పుస్తకాలకీ, తండ్రి తదనంతరం వచ్చినది మూడు గదుల ఇంటికీ ఓనరు కాగలిగాడు. ఒకటి వంటగదికి పోతే, మిగిలిన రెండు గదుల్లోనూ నలుగురు మనుషులు సర్దుకోవాలి. ఇంటి సామానుతోపాటు.. పుస్తకాల బీరువాలూ స్థలం ఆక్రమించాయి. చెన్నారెడ్డి ఎంత పుస్తక ప్రియుడో.. కొడుకు ఆదిత్యకు అవంటే ఆమడ దూరం.
'నా ఇంజనీరింగు చదువు చదువుకోవడానికే టైము చాలడం లేదు. ఆ కథలూ, నవలలూ ఎప్పుడు చదవనూ. ఏది కావాలన్నా గూగుల్‌లో వచ్చేస్తుంది' అనేవాడు. కూతురు ప్రమీలే అప్పుడప్పుడు చదివేది.
భార్య పాపారాణి విసుక్కునేది 'మన పిల్లలకి మీ పుస్తకాలు చదివే తీరికలేదు. వాటిని తీసుకుపోయి ఏ లైబ్రరీ కన్నా ఇచ్చేస్తే, ఇల్లు ఖాళీ అవుతుంది కదా' అని.
'పుస్తకం విలువ నీకేం తెలుసు. అవి నా ప్రాణం.. పిల్లాడికి ఇంట్రస్టు లేకపోతే, పిల్లకన్నా నా ఆస్తిగా ఇస్తాను' అనేవాడు.
ఆ మాటకి ప్రమీల మొదట్లో నవ్వుకున్నా .. ఆ తరువాత 'నాన్నా అవి నీ చిన్నప్పటి నుంచీ ఉన్న పుస్తకాలు. ప్రస్తుతం వాటి పేపర్లు పాతవై.. చివికిపోయి ముక్కలు అయిపోతున్నాయి. నువ్వెంత నాప్తలిన్ బాల్స్ వేసినా సిల్వర్ ఫిష్‌లు చేరి పాడుచేస్తున్నాయి. అక్కడక్కడ చెదలూ పట్టినరు. బాగున్నవి ఏవో చూసి, అమ్మ చెప్పినట్లు లైబ్రరీకి ఇచ్చేయ్యడమే మంచిది.
'ప్రస్తుతం పుస్తకాలు కావాలంటే, ఆన్‌లైనులో బుక్ చేసుకుంటే, లైటు వెయిట్.. తేలికపాటి పుస్తకాలు దొరుకుతున్నాయి. అప్పటి పుస్తకాలు అయినా ఇప్పుడు కొత్తగా దొరుకుతున్నాయి. అవి మామూలు పేపరు కన్నా ఎక్కువ కాలం మన్నుతాయి. మారుతున్న కాలంతో మనమూ మారాలి నాన్నా!' అని కూతురు పూజిత అనడంతో హతాశుడయ్యాడు చెన్నారెడ్డి.
జీవితం అనేక సంఘటనల సమ్మేళనం. అందులో కొన్ని సంతోషంగానూ, మరికొన్ని మరచిపోలేనివిగానూ ఉంటాయి. కాలం మారిపోయింది. ఇప్పుడు అంతా డిజిటల్ చెల్లింపులతోనే నడుస్తుంది లోకం. మల్లెపూల వాళ్ళ దగ్గరా, కూరగాయల వాళ్ళ దగ్గరా అదే నెట్‌వర్క్ ఉంటుంది. తనూ మారుతున్నట్లుగా, మంచిగా ఉన్న పుస్తకాలు అన్నీ తీసుకుని.. ఎప్పుడో మరచిపోయిన లైబ్రరీ వైపు అడుగులేశాడు చెన్నారెడ్డి.
పిఎల్ ఎన్. మంగారత్నం
9701426788.