టిడిపి శ్రేణులకు బాలకృష్ణ పిలుపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :'ఇది కేసులను లెక్కచేసే సమయం కాదు. భయపడే ప్రసక్తే లేదు. నేను వస్తున్నా...! ప్రతి ఒక్కరూ ఉద్యమించండి. తెలుగువాడి సత్తా చూపుదాం.' అనిప్రముఖ సినీ నటుడు, హిందుపురం ఎంఎల్‌ఏ, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి 16 నెలలు జైలులో ఉండివచ్చారని, చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో పెట్టాలని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రాజకీయకక్షలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. జగన్‌కు ఉన్న అవినీతి మచ్చను అందరికీ అంటించాలని చూస్తున్నారని, అయినాచంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. సిఎం కేవలం పాలసీ మేకర్ మాత్రమేనని , అధికారులే అమలు చేస్తారన్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారి అజరుకల్లామ్ ప్రతిపాదిస్తే, మరో అధికారి ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారని వివరించారు. ప్రభుత్వం రూ.370కోట్లు ఖర్చు చేసి రూ.2.13లక్షల మందికి శిక్షణ ఇచ్చిందన్నారు. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ కూడా ఇచ్చిందని బాలకృష్ణ తెలిపారు.