Jul 28,2023 11:38

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : హింసపై మహిళల పోరుయాత్రను శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి తెలిపారు. హిందూపురం నుంచి ఒక యాత్ర, విశాఖ ఉక్కు నగరం నుంచి మరొక పోరుయాత్ర ప్రారంభంకానుందని చెప్పారు. ఈ రెండు యాత్రలు ఆగష్టు 8న విజయవాడకు చేరుకుంటాయని, ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోరుయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను అనంతపురంలోని గణేనాయక్‌ భవన్‌లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అనేక రకాల హింసలు, దాడులు పెరిగాయన్నారు. మణిపూర్‌ ఘటనపై ప్రధాని స్పందించడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల రక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని కోరారు. అందులో భాగంగానే ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు మహిళల పోరుయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశం, రాష్ట్రంలో మహిళలపై హింస, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, ఇలాంటి దుర్ఘటనలను నిర్మూలించి మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు డాక్టర్‌ ప్రసూన, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి, జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజినమ్మ పాల్గొన్నారు.