Nov 18,2023 20:57

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలో కౌలురైతు గుర్తింపు కార్డు (సిసిఆర్‌సి)లు కలిగి వున్నకౌలు రైతులందరికీ వచ్చే రబీ సీజనులో పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో రుణాలు ఇవ్వలేక పోయినందున రబీలోనైనా కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో 12,734 మంది కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డులను జారీ చేయగా వీరిలో 1,115 మందికి రూ.3.62 కోట్లు మాత్రమే జిల్లాలోని అన్ని బ్యాంకులు కలసి ఖరీఫ్‌ సీజనులో రుణాలు ఇచ్చాయని, మిగిలిన వారికి రబీ పంటలకు గాను రుణాలు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం అనంతరం బ్యాంకుల వార్షిక రుణప్రణాళిక అమలులో సాధించిన ప్రగతిని బ్యాంకుల జిల్లా స్థాయి అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సంయుక్త సమావేశంలో కలెక్టర్‌ సమీక్షించారు.
జిల్లా వ్యవసాయ ప్రధానమైన ప్రాంతమైనందున జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అధికంగా అవకాశాలు వున్నాయని, ఆహార ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకోసం అమలు చేస్తున్న కేంద్ర పథకం పిఎంఎఫ్‌ఎంఇ ద్వారా జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు యూనిట్లను ఏర్పాటు చేయడంలో ఉద్యాన శాఖ, డిఆర్‌డిఎ, బ్యాంకులు కలసి పని చేయాలన్నారు. ఈ పథకంలో 270 యూనిట్లను ఏర్పాటు చేయాల్సి వుండగా ఇప్పటివరకు 49 మాత్రమే ఏర్పాటు చేశామన్నారు.
జగనన్న తోడు పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించే ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని కోరారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయడంలో వున్న సమస్య పరిష్కారంపై రిజిస్ట్రేషన్లు, మెప్మా, బ్యాంకుల అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యాదీవెన, వసతి దీవెన కోసం 24లోగా సంయుక్త ఖాతాలు తెరవాలి
రాష్ట్ర ప్రభుత్వం బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాల ద్వారా అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని జమ చేసేందుకు విద్యార్ధులు, వారి తల్లులకు కలసి ఉమ్మడి ఖాతాలు తెరవడంలో అన్ని బ్యాంకులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. ఈనెల 24వ తేదీ లోగా బ్యాంకు ఖాతాలు తెరిచే కార్యక్రమం పూర్తిచేయాలని సూచించారు. నవంబరు మూడో వారంలో జిల్లాలో జరిగే వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో బ్యాంకర్లు పాల్గొనాలని కలెక్టర్‌సూచించారు.
వార్షిక రుణ ప్రణాళికలో 70శాతం లక్ష్యాల సాధన
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన రుణ ప్రణాళికలో రెండో త్రైమాసికం ముగిసే (సెప్టెంబరు మాసంతం) నాటికి 70.05శాతం లక్ష్యాలను సాధించినట్లు లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు చెప్పారు. రూ.9,064 కోట్లకు గాను రూ.6,349 కోట్లు ఇప్పటివరకు వివిధ రంగాలకు బ్యాంకులు రుణాలను అందించాయన్నారు. ఇందులో పంటరుణాల లక్ష్యం 60శాతం సాధించినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్‌బిఐ ఎల్‌డిఒ రెహమాన్‌, యూనియన్‌ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్‌ మాధవి, ఎపిజివిబి ప్రాంతీయ మేనేజర్‌ రామకృష్ణరాజు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్‌, వ్యవసాయ శాఖ జెడి విటి రామారావు, పశుసంవర్ధక శాఖ జెడి విశ్వేశ్వరరావు, సాంఘికసంక్షేమ అధికారి రామానందం, గిరిజన సంక్షేమ అధికారి చంద్రశేఖర్‌, ఎపిఎంఐపి పీడీ లక్ష్మీనారాయణ, పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పాపారావు, మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి, ఉద్యానశాఖ డిడి జమదగ్ని తదితరులు పాల్గొన్నారు.