ప్రజాశక్తి-విజయనగరం : బాలల హక్కుల గురించి బాలలకు, సమాజానికి తెలియజేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బాలలు తమ బాల్యాన్ని అనుభవిస్తూనే నచ్చిన రంగం లో ఎదగాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, ఐసిడిఎస్, బెజ్జిపురం యూత్ క్లబ్ , కైలాష్ సత్యర్ది చిల్డ్రన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడ పిల్లల చదువు తల్లి దండ్రులకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నత విద్య వరకు డిబిటి పథకం ద్వారా నగదు చెల్లించే అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అంగన్వాడీ నుంచి హై స్కూల్ వరకు పాఠశాలలలో పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో పిల్లలకు చదువు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నందున కనీసం 18 ఏళ్ళు నిండే వరకు బాలికలను తల్లి దండ్రులు చదివించాలని, పెళ్లి చేయరాదని కోరారు. బాల్య వివాహాలను జరిపే తల్లి దండ్రుల పైన, వివాహానికి ఏర్పాట్లు చేసేవారి పైన, పురోహితులు ఆఖరికి బాల్య వివాహాలకు హాజరయ్యే అతిధుల పైన కూడా కేసు బుక్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీనేజేర్లు చెడు స్నేహాలు చేయ వద్దని, సెల్ ఫోన్లకు , సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని , అనుకున్న లక్ష్యాలను చేరే వరకు కళ్ల ముందు లక్ష్యమే కనపడాలని హితవు పలికారు. బాల్య వివాహాల నిరోధం పై కీలక బాధ్యత మహిళా పోలీస్ లకు ఉందని, నిరంతరం వీరు పర్యవేక్షణ చేయాలని అన్నారు. మహిళా హక్కుల కమిటీ ఛైర్పర్సన్ హిమ బిందు మాట్లాడుతూ ఆడ పిల్లలపై అనవసర ఆంక్షలు ఉండకూడదని అన్నారు. కార్యక్రమం లో బెజ్జిపురం యూత్ క్లబ్, ఐసిడిఎస్ ల ద్వారా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులను , మెమెంటో లను అందజేశారు. జాతీయ స్థాయి లో స్కేటింగ్ లో మొదటి బహుమతి సాధించిన బొల్లెంకుల లోహిత్ రెడ్డి, తైక్వాండో లో ఆసియా బుక్ అఫ్ రికార్డుస్ సాధించిన ఇషిత , నేషనల్ సూపర్ కిడ్‌గా అవార్డు పొందిన ముచ్చి రేయప్ప నితీష్, శ్రేష్ఠ బాలికగా అవార్డు పొందిన శ్రేయ మిశ్ర , యునిసెఫ్ అంబాసిడర్ , సఖి గ్రూప్ కార్యకర్త పెదమజ్జి సౌభాగ్య, యు.ఎన్.ఓ లో ఎ.పి ఎడ్యుకేషన్ పై ప్రసంగించిన అల్లం రిశిత రెడ్డి, నేషనల్ కామన్ వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించిన బెల్లాన హారికలను ఘనంగా సత్కరించి, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ శాంతకుమారి, సిడిపిఒలు, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రసాద రావు, విద్యార్థులు పాల్గొన్నారు.