న్యూఢిల్లీ : బామ్నోలి భూ సేకరణ వ్యవహారంలో విజిలెన్స్ మంత్రి నివేదికను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనాకు పంపినట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌కు నేరంలో భాగం ఉందని పేర్కొంటూ విజిలెన్స్ మినిస్టర్ అతిషి ఈ నివేదికను కేజ్రీవాల్‌కు సమర్పించారు. పశ్చిమ ఢిల్లీలోని బామ్నోలి గ్రామంలో 19 ఎకరాల భూ సేకరణలో అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ నివేదికను సిబిఐ, ఇడికి పంపాలని విజిలెన్స్ మంత్రిని కేజ్రీవాల్ ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. భూసేకరణగాను గ్రామస్తులకు ఇచ్చే పరిహారాన్ని రూ. 41 కోట్ల నుండి రూ. 343 కోట్లకు పెంచింది కానీ అనవసర ప్రయోజనాల స్థాయి రూ. 897 కోట్లు ఉందని నివేదిక పేర్కొంది. బామ్నోలిలో లబ్థి పొందిన భూ యజమానులకు బంధువైన వ్యక్తి ద్వారా చీఫ్ సెక్రటరీ కుమారుడికి ఉద్యోగం ఇచ్చారనే ఫిర్యాదుపై ఈనివేదిక వెలుగులోకి వచ్చింది.