Nov 18,2023 22:04

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరవధిక దీక్షను శనివారం రాత్రి భగం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ముందుగా ప్రభుత్వ వైద్యుల ద్వారా దీక్షలో కూర్చున్న నాయకులకు వైద్య పరీక్షలు చేయించారు. దీక్షలో ఉన్న నలుగురు ఎస్‌ ఎఫ్‌ ఐ నాయకులకు షుగర్‌ లెవెల్స్‌ 80 కిందకు పడిపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తోందని భావించి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలకు కొద్ది సేపు పెనుగులాట జరిగింది. విద్యార్దులు ఎక్కువగా ఉండటంతో పోలీసుల ప్రయత్నం విఫలమైంది. దీంతో పోలీసులు వెనుదిరిగారు. అనంతరం దీక్ష శిబిరం వద్ద జానపద కళాకారులు డప్పు శ్రీను, తిరుపతిరావు, రాము విప్లవ గీతాలు ఆలపించారు. దీక్షా శిబిరం వద్దకు సిఐటియు తమ్మినేని సూర్యనారాయణ, టివి రమణ, వి.లక్ష్మి, నాగభూషణం, ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షులు కె.అప్పలసూరి, యుటిఎఫ్‌ నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు.

 ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలకు సంఘీభావం తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీత

ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలకు సంఘీభావం తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీత

మరోవైపు దీక్షలు రెండోరోజు చేరుకున్నాయి. శనివారం టిడిపి మాజీఎమ్మెల్యే మీసాల గీత, జనసేన నాయకులు గురాన అయ్యలు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న న్యాయమైన పోరాటానికి అండగా ఉంటామన్నారు. ఎస్‌ఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సి హెచ్‌. వెంకటేష్‌ , పి రామ్మోహన్‌ మాట్లాడుతూ జిల్లాలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని, ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు అని తెలిపారు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్ష కొనసాగుతుందని తెలిపారు. అనంతర పరిణామాలకు, విద్యార్థుల ఆందోళనకు జిల్లా విద్యా యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 21న జరిగే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని కోరారు.