ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో మత్స్యకారుల జీవనం దినదినగండంగా మారింది. ఏళ్ల తరబడి ఎదుగూ బొదుగూ లేని వారి జీవితాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు. దీంతో సముద్రంలో పట్టిన చేపలకు మార్కెట్ సదుపాయం లేక విలువైన మత్స్య సంపదను దళారులకు నచ్చినంతకు ఇచ్చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగని నిల్వ చేసుకునేందుకూ సదుపాయాలు లేవు. స్థానికంగా జెట్టీ లేదా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లేకపోవడం వల్ల వేట సమయంలో మత్స్యకారులు ఒడ్డుకు చేరడం కష్టమౌతోంది. నిత్యం ప్రమాదాలకు గురౌతున్నారు. ఇటువంటి సందర్భాల్లో వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోతున్నాయి. మరోవైపు జలాశయాలు, చెరువుల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులకు కూడా ప్రభుత్వం నుంచి తగినంత ప్రోత్సాహం లేదు.
జిల్లాలో సుమారు 4,500 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వీరంతా చేపలవేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వీరిలో సుమారు 3,522 కుటుంబాల వారు సముద్రం ఆధారంగా వేట సాగిస్తుంటారు. మైదాన ప్రాంతంలోని జలాశయాలు, చెరువులు ఆధారంగా జీవనం సాగించేవారికి ప్రభుత్వం నుంచి వృత్తిపరమైన ప్రోత్సాహం పెద్దగా అందడం లేదు. ఇక సముద్ర తీర మత్స్యకారులు నిత్యం జీవన్మరణ సమస్యే. వేటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేవరకు ప్రాణాలపై నమ్మకం ఉండే పరిస్థితి లేదు. నిత్యం ప్రమాదాలకు గురౌతున్నారు. చేపల జెట్టీ లేకపోవడంతో కనీసం బోట్లు లంగరు వేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోతోంది. ఒడ్డున దాచిన బోట్లు తుపానుల సమయంలో సముద్రంలోకి కోట్టుకుపోవడం, వలలు చిరిగిపోవడం పరిపాటిగా మారింది. కానీ, నష్టపరిహారం అంతంతమాత్రంగానే అందుతోందని భోగాపురం, పూసపాటిరేగ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకన్నా ముఖ్యంగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అంటూ లేకపోవడం వల్ల సముద్రంలోకి చేపలవేటకు వెళ్లి తిరిగి ఒడ్డుకు చేరుతున్న సమయంలో మత్స్యకారులు నిత్యం ప్రమాదాలకు గురౌతున్నారు. వీరిని పట్టించుకునే నాథులు లేరు.
మత్స్యకారుల వలస
పూసపాటిరేగ, పైడిభీమవరంలోని పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యం వల్ల దరిదాపుల్లో జాతైన చేపలు పడడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా సముద్రంలో చాలా దూరం వెళ్లి తెచ్చుకున్న చేపలు కనీసం గంట కూడా నిల్వ చేసుకునేందుకు శీతలగిడ్డంగులు, ఫీడర్లు వంటివి లేవు. స్థానికంగా చేపలమార్కెట్ సదుపాయమూ లేదు. కనీసం ఏదో ఒక పట్టణం తీసుకుపోదామంటే వాహన సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించలేదు. దీంతో ఒడ్డుకు తెచ్చిన వెంటనే దళారులు అడిగినంతకు ఇచ్చేయడం మత్స్యకారుల వంతవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి మత్స్యకారులు ఒడిశాలోని పారాదీప్, కర్నాటకలోని మంగుళూరు, గుజరాత్‌లోని హీరావలి తదితర తీర ప్రాంతాలకు వలసపోతున్నారు. అక్కడ కూడా సొంతంగా బోట్లు లేక కూలీలుగా మారుతున్నారు. వారి కుటుంబమంతా ఇక్కడే. ఏటా ఒకటి లేదా రెండు సార్లకు మించి రాలేని పరిస్థితి. వారు డబ్బులు పంపితేనే ఇక్కడి కుటుంబానికి పూటగడిచేది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. ఇందుకోసం పూసపాటిరేగ మండలం చింతపల్లిలో ఆరు ఎకరాల భూమి కూడా సేకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపనకు వచ్చిన సిఎం జగన్ పనిలోపనిగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఇందుకు రూ.23.55 కోట్ల వ్యయం కేటాయిస్తున్నట్టుగా కూడా చెప్పారు. కానీ, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. 61 రోజుల చేపలవేట నిషేధ సమయానికి రూ.10 వేలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్నే గొప్పగా చెప్పుకుంటోంది. రేగిడి మండలం ఆర్.ఆమదాలవలస వద్ద రూ.కోటితో తలపెట్టిన ఆక్వా హబ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫిష్ ఆంధ్రా యూనిట్ల వల్ల చేపల వ్యాపారులకు తప్ప, తమకుగానీ, వినియోగదారులకు గానీ ఎలాంటి ప్రయోజనమూ లేదని మత్స్యకారులు చెబుతున్నారు.
నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమం
ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవంగా ప్రభుత్వం జరుపుతోంది. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు చేసినట్టు మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి తెలిపారు. మంగళవారం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. అనంతరం జిల్లాలో 32 మంది మత్స్యకారులకు ఒక్కొక్కటి రూ.75 వేలు విలువైన ద్విచక్ర వాహనాలు, ఒక్కొక్కటి రూ.20 లక్షలు విలువైన 3 లైవ్ ఫిష్ రవాణా వాహనాలను పంపిణీ చేయనున్నారు. ఇంతటితో సరిపెట్టుకుంటే తమ వెతలు తీరేదెప్పుడు అంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.