ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి మండలం వేగావతి నది పరివాహక గ్రామమైన పెంటలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను రైతులు అడ్డుకుంటున్నా ఏమాత్రమూ వెనక్కి తగ్గడం లేదు. రాత్రి సమయాల్లో అడ్డగోలుగా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టి, అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా, నది పరివాహక ప్రాంతాల్లోని భూములు కోతకు గురవుతున్నా అధికారులకు మాత్రం పట్టడం లేదు. ఇసుక అక్రమ రవాణాలో ఓ విఆర్‌ఒ హస్తం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని పెంట గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. గ్రామ సమీపంలోని వేగావతి నది నుంచి రాత్రి సమయాల్లో అదే గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. రోజుకు సుమారు 80 వరకు ట్రాక్టర్ల లోడు ఇసుకను విక్రయిస్తున్నారు. నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి గ్రోత్ సెంటర్‌లోని పరిశ్రమలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పరిశ్రమ, ప్రభుత్వ అభివృద్ధి పనులు, ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుక సరఫరా చేసేందుకు ప్రభుత్వం గ్రోత్ సెంటర్లో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసింది. అక్కడ ట్రాక్టర్ ఇసుక రూ.2500 వరకు ధర పలకడంతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టి, రూ.1500కే సరఫరా చేయడంతో నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు, పరిశ్రమ యాజమాన్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్ వద్ద కొనుగోలు చేయడం లేదు. ఇసుక అక్రమ రవాణాదారుల వద్ద కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేయొద్దని అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.
భూగర్భజలాలపై ప్రభావం
వేగావతి నది ఆధారంగా పెంట గ్రామస్తులకు తాగునీరు అందుతోంది. ఆ నది ఆధారంగానే వ్యవసాయ బోర్లు వేసి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. సుమారు 1500 ఎకరాలకు సాగునీటి బోర్లే ఆధారం. గత కొన్నేళ్లుగా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు, సాగునీరు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు పంట భూములు కోతకు గురికావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. నదిలో పెద్ద గోతులు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పిక్నిక్ సీజన్ కావడంతో గోతుల్లో నీరు చేరి ఆయా గోతుల్లో సందర్శకులు దిగితే ప్రాణాలకు ముప్పు తప్పదని చెబుతున్నారు.
రెండు ట్రాక్టర్లు అప్పగింత
నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలతో నష్టాన్ని గుర్తించిన రైతులు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నడుం బిగించారు. నెల రోజుల క్రితం నదిలో ఇసుక తవ్వుతున్న మూడు ఇసుక ట్రాక్టర్లను రైతులు పట్టుకున్నారు. అందులో ఒక డ్రైవర్ రైతులపైకి ట్రాక్టర్‌తో దూసుకెళ్లి తప్పించుకుని వెళ్లిపోయాడు. రెండు ట్రాక్టర్లను పట్టుకుని రెవెన్యూ అధికారులకు రైతులు అప్పగించారు. వాల్టా చట్టం ప్రకారం ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి అపరాధ రుసుం విధించారు.
మామిడితోటలో అన్‌లోడ్
వేగావతి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను రైతులు శనివారం రాత్రి అడ్డుకున్నారు. రైల్వే వంతెన సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడంతో రైతులు అడ్డుకునేందుకు వెళ్లారు. ఇసుక లోడ్ చేసిన ట్రాక్టర్లను సమీపంలో ఉన్న మామిడి తోటలో దాచేశారు. తోటలో ట్రాక్టర్లను గుర్తించిన రైతులు వాటిని తీసుకువెళ్లకుండా కాపలా కాసి, విఆర్‌ఒను తీసుకొచ్చేందుకు ఆయన ఇంటికి ఇద్దరు వెళ్లారు. తొట్టెలో ఉన్న ఇసుకను అన్‌లోడ్ చేయాలని విఆర్‌ఒ ఇసుకాసురులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ట్రాక్టర్ డ్రైవర్లు అన్‌లోడ్ చేసి ట్రాక్టర్లను తీసుకెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ రవాణాకు విఆర్‌ఒ సహకారం?
ఇసుక అక్రమ రవాణాలో పెంట విఆర్‌ఒ హస్తం ఉన్నట్లు రైతులు జి.నగిరేష్, జి.త్రినాథ, సిహెచ్ మహందాత, ఎస్.శ్రీను, జి.రమణ ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాపై ఆర్‌ఐకు ఫోన్ చేయగా విఆర్‌ఒను పంపిస్తామని ఆయన చెప్పినప్పటికీ విఆర్‌ఒ ఇసుక అక్రమంగా తవ్వుతున్న ట్రాక్టర్ యజమానులకు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. గ్రామ సచివాలయానికి కూతవేటు దూరంలోనే ఇసుక తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. సచివాలయ కార్యదర్శికి మామూళ్లు అందడం వల్లే ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను రైతులు, ప్రజలు కోరుతున్నారు.
అక్రమ రవాణాపై నిఘా
ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెడతామని తహశీల్దార్ డోల రాజేశ్వరరావు చెప్పారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వడం నేరమన్నారు. రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.