Nov 19,2023 22:37

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అటు దేశాన్ని.. ఇటు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పూర్తిగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారని రాజ్యసభ మాజీ సభ్యుడు, పిసిసి మీడియా కమిటి ఛైర్మన్‌ నర్రెడ్డి తులసి రెడ్డి ఆరోపించారు. రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక కష్ణ నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 106వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిర చిత్రపటానికి కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి, వైసిపి, టిడిపి, జనసేన వంటి దుష్టచతుష్టయ పార్టీలను ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 25కి 25 మంది ఎంపీలను గెలిపించండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టారని, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వబోమని ప్రకటించినా కనీసం వత్తిడి తేలేని దుస్థితిలో వైఎస్‌ జగన్‌ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుందని, డిసెంబర్‌ 3న తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమన్నారు. ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు.. తెచ్చే శక్తి లేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆరు సూత్రాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. దేశంలో రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శులు ముళ్ల మాధవ్‌, ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, తాళ్లూరి విజయకుమార్‌, పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.