Nov 20,2023 21:28

దీక్షలను విరమింపజేస్తున్న విద్యాశాఖాధికారులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేసిన పోరాటానికి జిల్లా అధికార యంత్రాంగం దిగొచ్చింది. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఇఒ లింగేశ్వరరెడ్డి, ఆర్‌ఐఒ ఎం.ఆదినారాయణ, సంక్షేమ శాఖ అధికారులతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చర్చలు జరిపారు. చర్చల్లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ మాట్లాడుతూ ఆగస్టులో ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన సైకిల్‌యాత్రలో గుర్తించిన సమస్యలను వివరించారు. స్పందించిన అధికార యంత్రాంగం ఈ నెల 25న విద్యా శాఖ అధికారులందరితో సమావేశం ఏర్పాటుచేస్తామని చెప్పారు. సమావేశ అనంతరం పది రోజుల్లో జిల్లా యంత్రాంగం చేతుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరవధిక దీక్షలను విరమించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం అంగీకరించింది. అనంతరం డిఇఒ లింగేశ్వరరెడ్డి, ఆర్‌ఐఒ ఆదినారాయణ, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి రామానందం వచ్చి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్‌, రామ్మోహన్‌ మాట్లాడుతూ పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం తలపెట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు.
దీక్షలకు పలువురి మద్దతు
విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు నాలుగో రోజు సోమవారం పలువురు మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని టిడిపి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున సందర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే విద్యార్థుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షలకు తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మద్దెల ప్రవీణ్‌ కుమార్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు వేముల చైతన్యబాబు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్‌ సంఘీభావం తెలియజేశారు. దీక్షా శిబిరాన్ని ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ దయానంద్‌, ఎపి మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుఎస్‌ రవికుమార్‌, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బుద్దరాజు రాంబాబు సందర్శించి, మద్దతు తెలిపారు. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.