Nov 20,2023 20:54

మృతి చెందిన గొర్రెలు

ప్రజాశక్తి - లక్కవరపుకోట: మండలంలోని సోంపురం జంక్షన్‌ సమీపంలో సోమవారం తెల్లవారు జామున గొర్రెల మందపై గుర్తు తెలియని కారు దూసుకెల్లడంతో 17 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు పైబడి గాయాలపాలయ్యాయి. ఎస్‌కోట మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు వారాధి అప్పలి, వారధి బంగారయ్య, బొబ్బిలి గోవింద, యండపల్లి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... అనకాపల్లి జిల్లా సబ్బవరం నుండి సుమారు 300 గొర్రెలను వాళ్ల స్వగ్రామానికి తోలుకొని వెళుతుండగా విశ్రాంతి కొరకు ఆదివారం రాత్రి సోంపురం జంక్షన్‌ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో గొర్రెలను నిలుపుదల చేశారు. అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో తమ స్వగ్రామాలకు బయలుదేరి గొర్రెల మందను రోడ్డు ఎక్కిస్తుండగా శృంగవరపుకోట వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు బలంగా ఢకొీనడంతో అక్కడికక్కడే 17 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలకు పశువైద్యాధికారి కోరాడ గాయత్రి పోస్టుమార్టం నిర్వహించారు. కాళ్లు విరిగి గాయాలపాలైన 30 పైబడి గొర్రెలకు వైద్యం అందించారు. ఈ ఘటనపై ఎల్‌ కోట పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.