ప్రజాశక్తి- లక్కవరపుకోట, విజయనగరం కోట : సుమారు తెల్లవారు జామున ఐదు గంటల సమయం.. అప్పుడే గాఢ నిద్ర నుంచి తేరుకుంటున్న గ్రామస్తులకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు శబ్ధం వినిపించింది. ఏమైందో తెలియక అయోమయంలో పడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలు ఉంటుందని గుర్తించి పరుగులు తీశారు. పెద్ద పెద్ద కేకలతో కాలిన మంటల్లో నుండి బయటకు వస్తున్న క్షతగాత్రులను గుర్తించారు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
మండలంలోని గవరవీధిలోగల ఒక ఇంటిలో పూసపాటిరేగ మండలం నుండి వలస వచ్చిన తామరాపల్లి వెంకటలక్ష్మి, ఆమె కుమార్తె కెల్ల శ్రావణి, మనవడు మోహన్, మనవరాలు లాష్యలతో కలిసి వారం రోజులు క్రితం అద్దెకు దిగారు. శనివారం రాత్రి వంట గ్యాస్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. వీరి నలుగురితో పాటు కెల్ల శ్రావణి అన్నయ్య కుమార్తె తామరాపల్లి ప్రణవి కూడా శనివారం రాత్రి వీరి ఇంట్లో నిద్రించింది. రాత్రి తెచ్చిన గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో గది అంతా గ్యాస్ వ్యాపించింది. చలికాలం అవడం వల్ల తలుపులు, కిటికీలు మూసి ఉంచడంతో గ్యాస్ బయటకు పోలేదు. ఆదివారం తెల్లవారు జామున సుమారు ఐదు గంటల సమయంలో తామరాపల్లి వెంకటలక్ష్మి నిద్రలేచి లైట్ వెలిగించేందుకు స్విచ్ వేయడంతో విద్యుత్ సార్ట్ సర్య్యూట్ వల్ల గదిలో వ్యాపించిన గ్యాస్ అంటు కోవడంతో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దంతో గోడలు, కిటికీలు, తలుపులు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న తామరాపల్లి వెంకటలక్ష్మి (50), కెల్ల శ్రావణి (30), కెల్ల మోహన్ (10), కెల్ల లాస్య (8), తామరాపల్లి ప్రణవి (7) పూర్తిగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక 108 వాహనంలో ఎస్‌కోట సిహెచ్‌కి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో అక్కడ నుండి విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఆడారి కనకమహాలక్ష్మి, ఆడారి పుష్ప, మల్ల వెంకటరావు ఇల్లులే కాకుండా పక్క ఇల్లు పోలమరశెట్టి ఈశ్వరమ్మ, వెనక ఇల్లులు పోలమరశెట్టి రాంబాబు, మధు ఇల్లుల తలుపులు, కిటికీలు విరిగిపోయి స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇంటి వెనుక భాగాన్ని ఉన్న ఒక సాల, గడ్డిమేటు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌కోట అగ్నిమాపకదళం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. పేలుడు కారణంగా ధ్వంసమైన ఇల్లు రూ.5 లక్షలతో పాటు చుట్టు పక్కల మరో ఆరు గృహాలు దెబ్బతిన్నందు వల్ల రూ. 6లక్షల ఆస్తి నష్టం ఉంటుందని ఫైర్ ఆఫీసర్ షేక్ మదీనా వెల్లడించారు.
పలువురు పరామర్శ
ప్రమాద సంఘటన తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ టి కళ్యాణ చక్రవర్తి, ఆర్‌ఐ సన్యాసిరావు, విఆర్‌ఒ గణేష్, ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టిడిపి రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపిపి గేదెల శ్రీనివాసరావు, ఆర్ ఐ సన్యాసిరావు, విఆర్‌ఒ గణేష్‌లు విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుకులను పరామర్శించారు.