- పల్లెలనూ.. పట్టణాలనూ ఏకం చేసే అతి పెద్ద పండగల్లో దసరా ఒకటి. యాంత్రిక జీవనానికి కాస్త విరామమిచ్చి, సొంతూళ్లకు వెళ్లే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది. ఈ కొద్దిరోజులైనా ఊరికి, ఊళ్లోని మనుషులకు దగ్గరగా గడిపే అవకాశం కల్పిస్తోంది. ఊళ్లోని తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ, అత్త, పెద్దమ్మ, చిన్నమ్మ.. ఇలా ఎన్నో పిలుపులకు, వారి మమకారానికి పిల్లలను దగ్గర చేసేది ఈ పండగ సెలవులే. అనుబంధాలను పెంచే, ఉమ్మడితనాన్ని పెంచే అరుదైన పండగ ఇది. కొత్త కొత్త స్నేహాలు, పరిచయాలకు ఇది ఓ ఆలంబన. సరదాలు .. సందళ్లు.. సందేశాలు.. సందోహాలు.. ఇవ్వన్ని కలిస్తేనే పండగ. వాటన్నింటి కలబోతే దసరా. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...
పొట్టలోనున్న నాటి నుంచి బిడ్డకే కాదు..
విశ్వమంతటికీ ప్రేమను పంచిందీ..
లోక కంటకులను దునుమాడిందీ మాతృమూర్తులే!
సింధు నాగరికత నుంచీ ఎన్నో గురుతులు నేటికీ మన సంస్కృతిలో, జీవనంలో పెనవేసుకున్నాయి. మాతృస్వామ్య వ్యవస్థ నాటి జ్ఞాపకాలు దేశమంతా, ప్రపంచమంతా అనునిత్యం మనకు తారసపడుతూనే ఉంటాయి. ప్రకృతిని ఆరాధించే.. మాతృమూర్తిని జగన్మాతగా కొలిచే పండగ దసరా. అంతులేని ప్రేమకూ.. వాత్సల్యానికీ నెలవు తల్లి.. తన బిడ్డలు లోక రక్షకులు కావాలని కోరుకుంటుంది. వారే లోక కంటకులైతే.. సన్మార్గంలో పెట్టే సర్వ ప్రయత్నాలు విఫలమైతే.. రౌద్రమూర్తిగా మారి, సంహరిస్తుందని చాటిచెప్పే పండగ దసరా. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్న ఉత్సవాలే దసరా సందళ్లు. ఈ సందర్భంగా తూర్పు, ఈశాన్య భారతంలో దుర్గా దేవిని పూజిస్తే, దక్షిణభారత రాష్ట్రాల్లో స్త్రీ దేవతలను కొలుస్తారు. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో రాముడు రావణుడిని సంహరించిన పురాణ కథను ఉటంకిస్తూ, 'రామలీల'గా జరుపుకుంటారు.
దసరా పండగ సందర్భం అందరికీ ఒకటే అయినా, అది ఒక్కోచోట ఒక్కో పద్ధతిలో జరుగుతుంది. పండగ నేపథ్యం, నిర్వహించే పద్ధతి ప్రచారంలో ఉన్న కథలూ...ఒక్కోచోట ఒక్కోలా ధ్వనిస్తాయి, దర్శనమిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రం ఈ పండగలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
- జమ్మిచెట్టు ప్రత్యేకత..
ఈ ఉత్సవాల్లో మరో ప్రత్యేకత జమ్మి చెట్టు. ముళ్లకంపలాంటి.. కొండవాలుల్లో పెరిగే శమీ చెట్టును పూజించడం ప్రకృతితో మమేకమవడమే కదా! రామరావణ యుద్ధానికి ముందు రాముడు, అరణ్యవాసం పూర్తయ్యాక పాండవులు తమ ఆయుధాలను మూటకట్టి ఈ చెట్టుపై ఉంచి, ఈ చెట్టును పూజించారనే కథలున్నాయి. ఈ చెట్టుబెరడుతో చేసే కషాయం దగ్గు, ఉబ్బసం వ్యాధులను తగ్గించి ఆరోగ్యాన్ని, తద్వారా శుభాల్ని ఇస్తుంది. అధిక జీర్ణశక్తిని కలిగిస్తుంది. జమ్మి ఆకును తెలంగాణ ప్రాంతంలో బంగారమని పిలుస్తారు. ఈ పండగ నాడు పెద్దలకు, ఆత్మీయులకు ఈ జమ్మి బంగారాన్ని ఇచ్చి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ.
- మాతృమూర్తికి వందనం..
ఈ పండగ ప్రత్యేకత అమ్మని పూజించడమే కాదు.. తన పుట్టుకకు, జీవితానికి ఆలంబనగా నిలిచే మాతృమూర్తులందరినీ గౌరవించడం.
'అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ, చా బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి వుచ్చిన యమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
య్య కృపాబ్ధియిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్'
అంటూ కవిత్వంలోని గొప్పదనాన్ని, పటుత్వాన్ని తన కృపతో ప్రసాదించేది అమ్మేనంటూ బమ్మెర పోతన తన భాగవత రచనా సందర్భంలో గుర్తు చేసుకున్నారు. నేటికీ దసరా సందర్భంలో ఈ పద్యం వినిపిస్తూనే ఉంటుంది.
- పిల్లల సందడి..
పిల్లలు బాగా సందడి చేస్తూ సంబరపడే పండగ దసరా. ఒకప్పుడు తమ బడుల్లో చదివే పిల్లలను వెంటబెట్టుకుని గ్రామంలో ఇంటింటికీ వెళ్లేవారు. పిల్లలు కొత్తబట్టలు వేసుకుని, చేతుల్లో విల్లంబులు పట్టుకుని వచ్చేవారు. ఈ విలును గిలక అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారిమీద పూలూ ఆకులు పడేవి. పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ 'జయీభవ జయవిజయీభవ దిగ్విజయీభవ' అంటూ దసరా పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు, పాటలు అనేవారు.
'అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు.. అని వివరిస్తూ..
'ఏదయా మీదయా మామీద లేదు
ఇంతసేపుంచుట ఇది మీకు తగునా'.. అని దబాయిస్తూ..
పావలా బేడయితే పట్టేది లేదు
అర్ధరూపాయయితే అంటేది లేదు.
హెచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము..' అని తేల్చి చెప్పేస్తారు..
అన్నీ సర్కారు బడులే ఉన్న ఒకప్పటి కాలంలో.. ఇలా సందడి సందడిగా.. వీధుల్లో పిల్లల, ఉపాధ్యాయుల హడావిడి సాగేది. గ్రామాలతో, ప్రజలతో వారంతా మమేకమైన తీరును ఇది ప్రతిబింబిస్తుంది.
- బొమ్మల కొలువులు..
దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువులు మరో ప్రత్యేకత. దేవతా మూర్తులు, పక్షులు, జంతువులు, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే రకరకాల బొమ్మలను కొలువు తీరుస్తారు. ఈ కొలువులో తప్పనిసరిగా ఓ ముత్తయిదువ, షావుకారు, ఆవు, దూడ బొమ్మలు పెడతారు. బొమ్మల కొలువులను పన్నెండేళ్లలోపు పిల్లలతో అందంగా అలకరింపజేయడం, ఇరుగుపొరుగు వారిని పిలవడం ఆనవాయితీ. ఇతరులతో స్నేహ సంబంధాలు, ఇచ్చి పుచ్చుకునే ఆరోగ్యకరమైన ధోరణి పిల్లలకు అలవాటు చేయడానికి ఈ బొమ్మల కొలువు దోహదపడుతుంది.
ఓ బొమ్మల కొలువు పాటలోని ఓ చరణం.
'చిట్టిబొమ్మల పెండ్లి చేసేను జ్ఞానాంబ
చిత్రముగ చూడరమ్మ
మట్టి మీరిన లోకమంతా బొమ్మలు జేసి
నిట్టముగా లక్ష్మీదేవి వియ్యామందే..'
అంటూ సాగుతుంది.
తమిళనాడులోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. మధుర మీనాక్షి ఆలయంలో పెట్టే పెద్ద బొమ్మల కొలువు చాలా ప్రసిద్ధి. తమిళనాడులోని కులశేఖర పట్టణంలో దసరాకు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేవారు పులి, కోతి, భిక్షగాడు, రాజు, రాక్షసుడు... ఇలా రకరకాల వేషాలు వేస్తారు. 'ప్రతి రూపంలోనూ దేవుడు ఉంటాడు' అని చెప్పడం దీని ఉద్దేశమట. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ వేడుకలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు.
- బతుకమ్మ..
దసరా నవరాత్రుల్లో చేసే బతుకమ్మ పండగ తెలంగాణాకు ఓ తలమానికం. మహిళలు అత్యంత ఆనందంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండగలో అనేక వైవిధ్యాలు కనిపిస్తాయి. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ కొత్త బట్టలు, పట్టు చీరలు కట్టుకుని బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడటం, పోటీలు పడుతూ బతుకమ్మలను తయారుచేసి పరవశించడం ఇక్కడి ప్రత్యేకత. వివిధ రకాల పూలను, ఆకులను తెచ్చి, అందంగా అలంకరించి ఆ బతుకమ్మను అమ్మవారి అవతారాలుగా భావించి పూజిస్తారు. ఈ పండగలో ఆటపాటలతోపాటు రకరకాల వంటలు చేసి, అందరికీ పంచడం బతుకమ్మ సంస్కృతి.
జానపద సంగీతంలో బతుకమ్మ పాటలకు ప్రత్యేక స్థానముంది. ఈ పాటల్లో పురాణాలు, మానవీయ విలువలను తెలిపే విషయాలు, అత్తాకోడళ్ల హాస్యపు చతురోక్తులు ఉంటాయి. డప్పు వాయిద్యాలు, చప్పట్లు ఈ పాటలకు చక్కటి ఊపునిస్తాయి. ఈ పాటల్లో తరచుగా ఉయ్యాలో, చందమామ, వలో, కోల్‌కోల వంటి పదాలు వస్తూ.. అటు ఆడేవారికి ఇటు పాడేవారికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కాలానుగుణంగా రాజకీయ, సామాజిక, సాంఘిక సమస్యలన్నీ బతుకమ్మ పాటల్లో తమ స్థానాన్ని పదిలపరుచుకున్నాయి. స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ పాటలు చారిత్రక పాత్రను పోషించాయి. ప్రజల్లో చైతన్య జ్వాలలు రగిలించాయి. నిజాంపై సమరశంఖం పూరించేలా ప్రజలను సమాయత్తం చేశాయి.
- హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ హయాంలోనూ మైసూర్ మహోత్సవాలు
మతం పేరుతో విద్వేషం చిమ్మడం, అధికారం కోసం ఇతర మతాల ప్రార్థనా మందిరాలపై దాడులు చేయడం, దళితులను, మైనారిటీలను బలిగొనడం చేస్తున్న నేటి రోజుల్లో టిప్పు సుల్తాన్ పాటించిన మత సామరస్యాన్ని, పరమత సహనాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పటి మైసూర్ మహారాజులైన వడయార్లు 1610లో దసరా ఉత్సవాలను వైభవంగా జరపడం ప్రారంభించారు. తమ కుటుంబ దేవత చాముండేశ్వరీ దేవి మహిషాసురుడిని సంహరించినందుకు ప్రతీకగా ఈ ఉత్సవాలు జరిపేవారు. తొలుత అమ్మవారిని ఆరాధించి, ఏనుగుపై ఊరేగించేవారు. 1750 నుంచి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ చేతుల్లోకి మైసూర్ పాలన వెళ్లినప్పటికీ ఈ ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించేందుకు కృషి చేశారు. మతం పేరుతో ఎటువంటి తేడాను చూపలేదు. అంతేకాదు టిప్పు సుల్తాన్ తుదివరకూ బ్రిటీష్ వారిపై పోరాడాడు. నాలుగో ఆంగ్లో - మైసూర్ యుద్ధంలో 1799వ సంవత్సరం మే 4న వీరమరణం పొందాడు. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ కాలంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన ఉత్సవాల గురించి ఎన్నో చారిత్రక ఆధారాలున్నాయి. తాము పరిపాలిస్తున్నప్పటికీ వడయార్ కుటుంబీకులనే రాజుగా ఆ ఉత్సవాల్లో ప్రజల ముందుంచి, కమాండర్- ఇన్- చీఫ్‌గా వ్యవహరించేవారు. రాష్ట్రంలోని ప్రముఖులందరినీ ఉత్సవాలకు ఆహ్వానించేవారు. పది రోజులపాటు విందు ఏర్పాటు చేసేవారు. బాణాసంచా కాల్పులు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వంటి క్రూర మృగాలతో పోరాటం, రెజ్లింగ్ తదితర అనేక పోటీలు నిర్వహించేవారు. విజేతలకు బహుమతులు, వేతనాల పెంపుతోసహా అనేక సౌకర్యాలు కల్పించేవారు. ఈ ఉత్సవాల్లో, పోటీల్లో మతాలకు అతీతంగా పాల్గొనడం నాటి నుంచీ కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్సవాల సందర్భంగా నెల రోజుల ముందు నుంచే ఇక్కడ హడావిడి మొదలవుతుంది. రాజభవనాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్యాలెస్ అంతా లక్షకుపైగా బల్బుల అలంకరణతో దేదీప్యమానంగా శోభిస్తుంది. వైవిధ్యమైన జానపద కళారూపాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. క్రీడల పోటీలు ఇందులో భాగమే. ప్రదర్శనకు అగ్రభాగాన అందంగా అలంకరించిన ఏనుగులు పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకత. ఏనుగుపైనే చాముండేశ్వరీ దేవిని ఊరేగిస్తారు. ఆయుధపూజ వైభవంగా నిర్వహిస్తారు. నగరం వెలుపల నిర్వహించే టార్చ్‌లైట్ పరేడ్‌లో యువత ఉత్సాహంగా పాల్గొంటారు.
- ఉత్తరాదిన..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 200 ఏళ్లుగా తొమ్మిది రోజులపాటు 'రామలీల' నాటకాన్ని ధారావాహికంగా ప్రదర్శిస్తారు. ఇక ఢిల్లీలో 170 ఏళ్ల కింద మొఘల్ చక్రవర్తి బహద్దుర్ షా జాఫర్ 'రామలీల' సంగీతాలను ప్రారంభించారు. నాటి నుంచి దసరా నవరాత్రుల్లో ఇవి కొనసాగుతూనే ఉన్నాయి.
- 400 ఏళ్ల నుంచి కళారం
ఒంగోలు చిన్న గ్రామంగా ఉన్నప్పుడు కళారం ఆచారం ప్రారంభమైంది. కళారం అనే పదం కరాళ వక్త్రం (ఖండించి నాలుక తెరిచి ఉంచిన శిరస్సు) నుంచి వచ్చిందట. ఇక్కడి పురాణ కథల ప్రకారం.. బ్రహ్మ వరం వల్ల రక్తబీజుడనే రాక్షసుడి రక్తం నేలమీద పడితే మళ్లీ పుట్టుకొస్తాడట. అందువల్ల ఆదిపరాశక్తి తన నాలుకను యుద్ధ క్షేత్రం అంతా ఆవరించి, ఒక్క చుక్క రక్తం కూడా నేల మీద పడకుండా రక్తభీజుడిని సంహరించింది. అలా ఉన్న ఆమె శిరస్సు రూపాన్ని శరన్నవ రాత్రుల్లో ఊరేగిస్తారు. ఈ నగరంలో కాళికాదేవి, మహిషాసుర మర్ధని, నరసింహస్వామి తదితర ఆరు కళారాలు ఆరు రంగుల్లో నిర్వహిస్తారు. తొలిరోజుల్లో గూడు బండ్లపై కళారాలను ఊరేగించేవారు. రాగి, ఇతర లోహాలతో నాలుగు అడుగుల ఎత్తులో వీటిని తయారు చేస్తుండటంతో కనీసం పదిమంది ఉంటే గాని వీటిని పైకి లేపలేరు. ఒక వాహనంపై అడ్డంగా కడ్డీ ఉంచి, దానిపై శిరస్సు ఉంచుతారు. కళారం వెనుకభాగంలో ఒకరు వీరనృత్యం చేస్తూ... కళారాన్ని ఊపుతూ ఉంటారు. ఈ కళారంతోపాటు వాయిద్య ఘోషలు, పురాణ పాత్రల వేషధారణలు దుర్గాష్టమి రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఈ కళారాలు సాగుతాయి. ఊరిమధ్యలో రాక్షస సంహార ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళారాలలో నరసింహస్వామి కళారం పెట్టడం ఆనవాయితీ. ఆయనకు కూడా అమ్మవారి నుంచే శక్తి లభించిందట. ఈ రెండు రోజులు అర్ధరాత్రి సమయంలో సైతం వేలమంది జనం పాల్గొంటారు.
- బెజవాడ బేతాళ వేషాలు..
దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు విజయ దశమినాడు రాత్రి సమయంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవి, మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణానదిలో హంసవాహనంపై నదీవిహారం చేస్తారు. అమ్మవారి త్రిలోక సంచారానికి గుర్తుగా నదిలో మూడుసార్లు హంసవాహనాన్ని (తెప్పను) తిప్పుతారు. దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం బెజవాడ బేతాళ వేషాలు ప్రారంభమయ్యాయి. తెప్పోత్సవం ముగిసిన తరువాత ఉత్సవ మూర్తులతో అప్పట్లో గ్రామోత్సవం నిర్వహించేవారట. ఇప్పుడు కూడా పోలీసుల పర్యవేక్షణలో పాతనగరంపై ఉత్సవ మూర్తులను ఊరేగిస్తున్నారు. ఊరేగింపు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు రావడంతో ముగుస్తుంది. చివరిరోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ సందర్భంగా ప్రదర్శించేఉ భేతాళ నృత్యం విజయవాడ ప్రత్యేకత. మొదట్లో పాతబస్తీ కొత్తపేట కేంద్రానికి చెందిన బి.గురువులు, చంటి బేతాళ వేషాలు వేసేవారు. ఈ వారసత్వం నేటికీ కొనసాగుతోంది. కాళికాదేవి వేషానికి అవసరమైన చేతుల బరువు పాతిక కిలోలు ఉంటుంది. వాటిని వీపునకు తగిలించుకుని, తలపై కిరీటం పెట్టుకుని.. నృత్యం చేసే కళాకారులు ఎందరో ఉన్నారు. ఈ బృందాలు ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి.
- మచిలీపట్నంలో శక్తిపటం..
- కాళికా నృత్యం
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో శక్తి ఆరాధన, శక్తిపటాల ప్రదర్శన నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో మొదటిరోజు తెల్లవారుజామున ఊరి పొలిమేరలో ఓ వ్యక్తి శక్తిపటాన్ని ఎత్తుకుంటాడు. ముఖానికి కరాళం (మాస్కు) ధరించి, చేతిలో చురకత్తితో కనక తప్పెట్ల మధ్య కాళికా నృత్యాన్ని తలపించేలా ప్రదర్శన చేస్తాడు. వెదురుతడికతో ఆరు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తున శక్తిపటాన్ని తయారు చేస్తారు. 25 నుంచి 30 కిలోల బరువుండే శక్తి పటాన్ని మోస్తూ.. ఈ కార్యక్రమం నిర్వహించడం ఆ వ్యక్తికి కత్తిమీద సామే.
- వీరవాసరంలో అంబరాన్నంటే ఏనుగు సంబరం
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం 'ఏనుగు సంబరానికి' దాదాపు ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర ఉంది. దసరా వెళ్లిన తరువాత వచ్చే మూలా నక్షత్రం రోజు బేతాళస్వామి ఉత్సవాలు ప్రారంభిస్తారు. బేతాళ సంబరం జరిగే రోజు బేతాళ స్వామి ప్రతిమను, ఖడ్గాయుధాన్ని గడ్డితో తయారు చేసిన ఏనుగు బొమ్మ అంబారీ ఎక్కిస్తారు. దీంతోపాటు మరో చిన్న ఏనుగు బొమ్మనూ తయారు చేస్తారు. ఆ రోజు రాత్రి నుంచి దాదాపు తెల్లవారే వరకూ వీరవాసరం పశ్చిమ కాలువ వద్ద నుంచి ప్రధాన రహదారి వెంట బుట్టబొమ్మలు, పౌరాణిక పాత్రలు, పగటి వేషాలు, మేళ తాళాలతో ఊరేగిస్తారు. బేతాళ స్వామి ప్రతిమను తూర్పు చెరువులో నిమజ్జనం చేస్తారు. ఖడ్గాయుధాన్ని తిరిగి ఆలయంలో ఉంచడంతో ఏనుగు సంబరం ముగుస్తుంది. ఈ ఉత్సవాలు చూసేందుకు దాదాపు 50 గ్రామాల ప్రజలు వస్తారు.
- దసరా వేషాలు..
దసరా రోజుల్లో వివిధ వేషధారణ చేసి ఇంటింటికీ తిరిగి ఇచ్చింది పుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వీటినే దసరా వేషాలు.. పగటి వేషాలు అంటారు. ఈ పర్వదినాల్లో ఎన్నో జానపద, సినీ గీతాలు హుషారెత్తిస్తాయి. 'దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా.. దశమి వచ్చిందయ్యా.. దశనే మార్చిందయ్యా.. జయహో..' లాంటి సినీ గీతాలు ఎన్నో వింటూ ఉంటాం.
మిగతా పండగల మాటెలా ఉన్నా.. దసరా పండగ ప్రకృతితో మనల్ని మమేకం చేస్తుంది. మూలాల్లోకి వెళ్లేలా చేస్తుంది. ఎంతో సాత్వికంగా ఉండే మహిళలే విశ్వమంతటికీ మూలమైన మహాశక్తి అంటూ చాటిచెబుతుంది. పురుష దేవతలకు శక్తిని ప్రసాదించింది అమ్మవారేనంటూ.. మహిళల ప్రాధాన్యతకు అద్దం పడుతుంది. దసరా అంటే ప్రకృతికి ప్రణామం.. మాతృమూర్తికి వందనం.. మనిషి మూలాలకు ప్రయాణం..
- మత సామరస్యానికి ప్రతీక బెంగాల్ ఉత్సవాలు
పశ్చిమ బెంగాల్‌లో అతి పెద్ద పండగ దుర్గాపూజ. ఈ రాష్ట్రంలో మతసామరస్యానికి ప్రతీకగా కూడా నిలుస్తాయి. కలకత్తా తదితర ప్రాంతాల్లో ముస్లిములు తమ చుట్టుపక్కల ఉన్న హిందువులు పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా దుర్గా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ రాష్ట్రలో కొనసాగుతూనే ఉంది. వామపక్షాల పాలనలో ఈ పరంపర మరింతగా దృఢమైంది. ఉత్సవాల్లో మతాలకు అతీతంగా అందరూ సరదాగా పాల్గొని, తమ ఆత్మీయ అనుబంధాలను కొనసాగిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా వీధులన్నీ విద్యుత్ వెలుగులతో, వివిధ అలంకరణలతో శోభాయమానంగా ఉంటాయి. సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో దుర్గామాతకు పూజ చేసి, తొమ్మిరోజున కాళికామాతను దర్శిస్తారు. ఈ పూజలో సాంబ్రాణి వేసుకున్న మట్టి కుండలు పట్టుకుని చేసే నాట్యానికి ప్రసిద్ధి. కొందరు మహిళలు కుండల్ని నోటితో కూడా పట్టుకుని నృత్యం చేస్తారు. దీంతోపాటు సింధూరం పూసుకోవడం మరో ప్రత్యేకత. మహిళలు ఒకరి చెంపలపై మరొకరు సింధూరం పూస్తారు.ఈ ఉత్సవాల్లో లక్షల మంది పాల్గొంటారు. చివరి రోజు దుర్గామాత విగ్రహాలను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిదిరోజులు రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం, ఉత్సవాల పందిళ్లలోనే పుస్తక ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.
ఒడిశాలో దసరా ఉత్సవాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టిస్తారు. మహిళలు మానికలో వడ్లు నింపి, పూజలు చేస్తారు. దీనిని 'మానబాన' అంటారు. దసరా రోజున బాణా సంచా కాలుస్తారు.
- దేవరగట్టు కర్రల సమరం..
కర్నూలు జిల్లా దేవరగట్టులో 800 అడుగుల ఎత్తయిన కొండపై మాలమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న పురాణ కథ ప్రకారం మాల, మల్లాసుర అనే రాక్షసులు ఉండేవారు. వారిని పార్వతీదేవి సంహరించింది. చనిపోవడానికి ముందు ఏటా దసరా నాడు తమకు నరబలి కావాలని వారు వరం కోరారట. సాధ్యం కాదని, ఆ రోజున గొరవయ్య తొడ నుంచి పిడికెడు రక్తాన్ని ధారపోయిస్తానని వరమిచ్చిందట. దీనికి గుర్తుగా బన్ని జైత్రయాత్ర ఏటా దసరా నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మూడు గ్రామాల వారు ఉత్సవ మూర్తులను కల్యాణ కట్ట వద్దకు తీసుకొస్తారు. మరో ఎనిమిది గ్రామాల వారు నిలువరిస్తారు. ఇలా రెండు గ్రూపుల వారు రెండుసార్లు కర్రలతో తలపడతారు. చివరికి కల్యాణ కట్ట వద్దకు ఉత్సవ మూర్తులను చేర్చడంతో బన్ని యాత్ర ముగుస్తుంది. ఈ కర్రల సమరంలో వేలాదిమంది పాల్గొంటారు. అనేకమంది క్షతగాత్రులవుతారు. శాంతియుతంగా నిర్వహించాలని పదే పదే కోరుతున్నా, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా.. ఈ సమరం అదేవిధంగా జరుగుతూనే ఉండటం గమనార్హం.
పి.మోహన సిద్ధార్థ్
9490099123