Nov 20,2023 21:37

దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి సురేష్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : వైసిపి అధికారంలోకి వచ్చాక మున్సిపల్‌ కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మున్సిపల్‌ కార్మికులను అవుట్‌ సోర్సింగ్‌కు మార్చి ద్రోహం చేస్తే.. సిఎం జగన్మోహన్‌రెడ్డి వారిని ఆప్కోస్‌లో చేర్చి నయవంచన చేశారని మండిపడ్డారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద సోమవారం చేపట్టిన నిరసన దీక్షలను సుబ్బరావమ్మ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులవి గొంతెమ్మ కోరికలు కాదన్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పట్టణాలను పరిశుభ్రం చేసి, ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడింది మున్సిపల్‌ కార్మికులేనని గుర్తుచేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఫెడరేషన్‌ జిల్లా నాయకులు ఎ.జగన్మోహనరావు మాట్లాడుతూ సోమ, మంగళవారాల్లో కలెక్టరేట్‌, మున్సిపల్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడుతున్నామని, ప్రభుత్వం స్పందించకుంటే కలిసివచ్చే సంఘాలతో డిసెంబర్‌లో నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. దీక్షలకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు టివి రమణ, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, శ్రామిక మహిళా నాయకురాలు బి.సుధారాణి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు, ఎపి మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుఎస్‌ రవికుమార్‌ మద్దతు తెలిపి, మాట్లాడారు. దీక్షలో గౌరీ, భాస్కర్‌రావు, ఆదినారాయణ, బాబురావు, చందర్రావు, లక్ష్మి, దుర్గారావు, పైడిరాజు, రాఘవ, వంశీ, శ్రీను, రామారావు, రజిని తదితరులు పాల్గొన్నారు.