Nov 20,2023 21:37

జెసికి వినతి అందిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-విజయనగరంకోట : కలెక్టరేట్‌లో సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ నిర్వహించారు. ఇందులో 241 వినతులు అందాయి. జాయింట్‌ కలెక్టర్‌తోపాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.డి.అనిత, ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, డిప్యూటీ కలెక్టర్లు బి.సుదర్శనదొర, కె.ఆర్‌.ఆర్‌.సి డిప్యూటీ కలెక్టర్‌ సుమబాల తదితరులు వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు వాటి పరిష్కారం కోసం పంపించారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా గ్రీవెన్స్‌లో వినతులు అందించారు. మొత్తం 241 వినతులు అందగా ఇందులో అధికంగా రెవెన్యూకు సంబంధించి 173 అర్జీలు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాల సమస్యలపై 25, డిఆర్‌డిఎ, పంచాయతీరాజ్‌ శాఖలకు 10 చొప్పున, హౌసింగ్‌, మున్సిపల్‌, వైద్య ఆరోగ్య శాఖలకు 7 చొప్పున, డిసిహెచ్‌ఎస్‌కు 2 వినతులు అందాయి.
వాగు ఆక్రమణపై ఫిర్యాదు
నగరంలోని పూల్‌బాగ్‌ కాలనీ, డబుల్‌ టిన్‌ కాలనీ ప్రాంతంలో గెడ్డ వాగు ఆక్రమణకు గురికాకుండా చూడాలని టిడిపి నాయకులు స్పందనలో ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కె.మురళీమోహన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, కర్రోతు నర్సింగరావు, కార్యదర్శి బంగారు బాబు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు న్యాయం చేయాలి
విజయనగరం మండలం గొల్లలపేటలో పొజిషన్‌ సర్టిఫికెట్లు పొందిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని మాజీ సర్పంచ్‌ ఈగల సత్తిబాబు ఆధ్వర్యాన స్పందనలో వినతి అందజేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
విజయనగరం టౌన్‌ : వైఎస్‌ఆర్‌నగర్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేన నాయకులు గురాన అయ్యలు.. స్పందనలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిడుగు సతీష్‌ , టి.రామకృష్ణ, కాటం అశ్విని, పితాల లక్ష్మీ, ఏంటి రాజేష్‌, ఎల్‌ .రవితేజ పాల్గొన్నారు