ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో పలు రంగాలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా రానున్న కాలంలో మరింత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. జిల్లా అభివృద్ధికి చోదకశక్తిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుందని, రానున్న రోజుల్లో దీని కేంద్రంగానే అభివృద్ధి అంతా ఉంటుందని తెలిపారు. నీతిఆయోగ్ ఆధ్వర్యంలో గ్రోత్ హబ్‌లపై విశాఖపట్నంలోని విఎంఆర్‌డిఎ కార్యాలయంలో సోమవారం విశాఖ పరిసర ప్రాంత జిల్లాల కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. విశాఖను గ్రోత్ హబ్‌గా రూపొందించాలని నీతిఆయోగ్ నిర్ణయించిన నేపథ్యంలో విశాఖ పరిసర ప్రాంత ఎనిమిది జిల్లాల కలెక్టర్లతో ఆయా జిల్లాల్లో వృద్ధికి గల అవకాశాలపై అధికారులు సమీక్షించారు. అందులో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విజయనగరం జిల్లాలో అభివృద్ధి అవకాశాలపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఉద్యాన పంటలకు పలు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా జిల్లాలో వాటి విస్తీర్ణాన్ని పెంచడం, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు సహకారం ఇవ్వాలన్నారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించవచ్చన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రమం ఏర్పాటవుతున్న నేపథ్యంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు చేపట్టడం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం లభిస్తుందన్నారు. గత ఏడేళ్ల కాలంలో వివిధ రంగాల్లో వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, సేవల, స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లో జిల్లా సాధించిన అభివృద్ధిని గణాంకాల రూపంలో వివరించారు. వృద్ధికి కీలకమైన ఈ రంగాల్లో ఏవిధమైన ప్రోత్సాహకాల ద్వారా రానున్న కాలంలో జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లగలమనే అంశాలపై కలెక్టర్ తన ప్రజంటేషన్‌లో వివరించారు. జిల్లాలోని యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. సమావేశానికి సిపిఒ పి.బాలాజీ కూడా హాజరయ్యారు. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి అన్నా రారు, సలహాదారు పార్ధసారధి రెడ్డి, మెకన్సీ కంపెనీ ప్రతినిధి అభిలాష్, ప్రణాళిక శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.