Nov 20,2023 23:25

కరపత్రాన్ని విడుదల చేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : కార్మిక, కర్షకుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలి వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని కన్నెగంటి హనుమంతు భవనం ప్రజాశక్తి నగర్‌లో కరపత్రాలను సోమవారం విడుదల చేశారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల రద్దు చేశారని చెప్పారు. రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలను తీసుకొస్తే రైతులు వాటిని తిప్పికొట్టారని గుర్తు చేశౄరు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల రుణాలను రద్దు చేయాలని కోరారు. నూతన విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఆపాలని కోరారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులతోపాటు రుణాలను షరతులేమీ లేకుండా ఇవ్వాలన్నారు. కార్మికులు, స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ (ఎంఎల్‌) నాయకులు నీలాద్రి రాంబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచాలని, పట్టణ ప్రాంతంలోనూ ఈ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని, రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలని, విద్యుల్‌, బస్సు చార్జీలను తగ్గించాలని కోరారు. ఈ అంశాలపైనే మహాధర్నా చేపట్టామని, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు టి.శ్రీనివాసరావు, ఎస్‌.వెంకటకృష్ణ, బి.కొండలు, ఎం.జయరాజు, ఎలగాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.