Nov 18,2023 22:04

ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిసిఎ కార్యదర్శి రాజు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :   జిల్లాలో యువకులకు, పెద్దలకు, మహిళలకు అందరికీ క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకుంది. 12 ఏళ్ల అనంతరం భారత్‌ జట్టు క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకోవడం, ఆదివారం ఆసీస్‌తో తలపడనుండడంతో అందరిలోనూ ఒకటే టెన్షన్‌. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన భారత్‌జట్టు ఆస్ట్రేలియా జట్టును ఓడించి 2003 నాటి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం నుంచి టివిలకు, నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఇడి స్క్రీన్లకు అతుక్కుపోయేందుకు సిద్ధమైపోయారు. ఎక్కడ చూసినా క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఎప్పుడొస్తుందా అని ప్రజలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా క్రికెట్‌ ఫీవర్‌ కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా 'ప్రపంచ కప్‌ విన్నర్‌ భారత్‌' అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఉత్కంఠ భరితంగా సాగగా, క్రికెట్‌ అభిమానులు టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్‌ను వీక్షించిన దశ్యాలు కనిపించాయి. ఎన్నడూ లేని రీతిలో ఈసారి ప్రపంచకప్‌లో ఇండియా క్రికెట్‌ టీం అన్ని విజయాలను అందుకోవడంతో క్రికెట్‌ అభిమానుల్లో ఆనందాలకు అవధులు లేవు. సెమీ ఫైనల్‌లో ఇండియా జట్టు గెలిచిన వెంటనే జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్‌ కోసం జిల్లా వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు. ఇండియా జట్టు ప్రపంచకప్పును ఒడిసిపట్టాలని ఆకాంక్షిస్తున్నారు. విజయనగరంలో క్రికెట్‌ అసోసియేషన్‌తో పాటు ,మహిళా పార్కు లో మహిళలు చూసేందుకు భారీ స్క్రీన్‌, ఇనాక్స్‌ దగ్గర ఒక స్క్రీన్‌, అదే విధంగా పలు ప్రైవేటు హోటళ్లలోను, బార్లలోను స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
పది వేల మంది చూసేందుకు ఏర్పాట్లు
ప్రజలంతా భారత క్రికెట్‌ జట్టుకు మద్దతు తెలపాలని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎమ్‌ ఎల్‌ ఎన్‌ రాజు తెలిపారు. ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్‌ సమీపం, ఎగ్జిబిషన్‌ మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫైనల్‌ పోటీని తిలకించేందుకు ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్‌ సమీపంలో ఉన్న మైదానంలో భారీ ఎల్‌ఇడి స్క్రీన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలు క్రికెట్‌ అభిమానులు పాల్గొని భారత జట్టు మద్దతు తెలపాలని కోరారు. క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షణకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదని తెలిపారు. భారీ ఎల్‌ఇడి స్క్రీన్‌తో పాటు డిజె సౌండ్‌, లైటింగ్‌, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సెలెక్టర్‌ వర్మ కోచ్‌ సురేందర్‌, రమేష్‌ చంద్రశేఖర్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.