ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆదివారం క్రికెట్ సందడి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి మ్యాచ్ ముగిసే వరకు జనాలు టీవీలు, భారీస్క్రీన్లు, సెల్‌ఫోన్లకు అతుక్కుపోయారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడికక్కడ ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేశారు. నగరంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన భారీ స్క్రీన్ ఏర్పాటుచేశారు. ఇక్కడికి భారీగా అభిమానులు తరలివచ్చి మ్యాచ్‌ను వీక్షించారు. మొదట ఇండియా బ్యాటింగ్ సమయంలో ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. నగరంలో ఉన్న ప్రధాన హోటళ్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసి, ఆఫర్లు పెట్టి వ్యాపారం చేసుకున్నారు. మ్యాచ్‌లో ఇండియా పరాజయం పాలవడంతో క్రికెట్ అభిమానులంతా నిరాశ చెందారు. ఓడినా చివరి వరకు పోరాడిన ఇండియా జట్టును అభినందించారు.