ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : నిజం వేరు... నమ్మకం వేరు... ఈ రెండు పదాలూ దాదాపు ఒకే అర్థాన్ని ఇచ్చేలా ప్రతిధ్వనిస్తున్నప్పటికీ, భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించేవారికి వీటి మధ్య వున్న తీవ్రమైన వ్యతాసం ఉందని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే నిజం నిప్పులాంటిది. నిరూపనకు సాధ్యమౌతుంది. నమ్మకం అనేది నిజాన్ని పోలి ఉంటుంది. నిజంపై ఆధారపడి ఉంటుంది. కానీ, నిరూపనకు సాధ్యం కాదు. ప్రస్తుతం మన జిల్లాలో కరువు ఉందా? లేదా అని చెప్పాలంటే భౌతిక పరిస్థితులను అర్థం చేసుకున్న వారికే సాధ్యమౌతుంది. లేదంటే నిబంధనలు అనే నమ్మకంతో కళ్లెదురుగా కరువు కూడా కానరాకుండానే పోతుంది. తాజాగా అధికారులు, ప్రభుత్వం చూపుతున్న లెక్కలు కూడా ఇందుకు అద్ధం పడతున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లాలో కరువు లేదంటున్నారు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ తమకు పటనట్టుగా వ్యవహరిస్తున్నాయి. కరువు ప్రతిపాదనపై వీరంతా చెబుతున్న నిబంధనల ప్రకారం జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు ఖరీఫ్ కాలంగా పరిగణంలోకి తీసుకోబడుతుందట. ఈ వాదనను ఒక్కసారి పరిశీలిస్తే... ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిపి సాధారణ విస్తీర్ణం 4.21 లక్షల ఎకరాలు కాగా, సెప్టెంబర్ 30 నాటికి 3.53 లక్షల ఎకరాలు(84శాతం) మాత్రమే సాగయ్యాయి. ఆ తరువాత మరో 11శాతం పెరిగింది. ఈలెక్కన మొత్తం ఇప్పటి వరకు 3.90లక్షల ఎకరాలు (93శాతం) వరకు సాగైంది. పంటలు త్వీరంగా ఎండిపోవడంతో పాటు నెల తేమశాతం, భూగర్భ జలాల తగ్గడం, రిమోట్ సెన్సింగ్, పశువులకు గడ్డి, దాణా దొరక్క పోవడం వంటి పరిస్థితులు ఎదురైతేనే కరువుగా గుర్తిస్తారట. జిల్లాలో ఖరీఫ్ ఈఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అంశాల్లోనూ కరువు నిబంధనలకు అనుగుణంగా లేవు. ఇది అధికారులు, ప్రభుత్వ వాదన. కానీ, భౌతిక పరిస్థితులు పరిశీలిస్తే ప్రభుత్వ వాదన ఏమాత్రం సరికాదన్నది స్పష్టంగానే అర్థమౌతుంది. నిజం ఏమంటే ఖరీఫ్ కాలంగా భావిస్తున్న జూన్ నుంచి అక్టోబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ, అన్ని నెలల్లోనూ ఒకే విధంగా లేదు. హెచ్చుతగ్గుల కారణంగా సకాలంలో వరి నారుపోత పూర్తి కాలేదు. ఇంత పంటలకూ ఆలస్యమైంది. దీనికితోడు పడిన వర్షపునీరు కూడా సముద్రం పాలైంది. ఎందుకంటే మన జిల్లాలో పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేవు. తోటపల్లి కాలువలు పూర్తికాకపోవడం వల్ల లక్ష్యానికి అనుగుణంగా నీరు అందించడం లేదు. ఇక తారక రామతీర్థసాగర్ నిర్మాణ పనులే పూర్తికాలేదు. గుర్ల గెడ్డకు అతీగతి లేదు. పెద్దగెడ్డ, ఆండ్ర, తాటిపూడి తదితర జలాశయాల నిర్వహణ కూడా అధ్వానంగా ఉండడంతో చివరి ఆయుకట్టుకు సాగునీరు అందడం లేదు. ఫలితంగా నాట్లు పడినప్పటికీ సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయాయి. మొత్తానికి పంట నాశనమైంది. ఇది నిజం అని చెప్పడానికి పొలాలను పరిశీలిస్తే తెలిసిపోతుంది. దీన్ని పక్కనబెట్టి వర్షపాతాన్ని, భూగర్భ జలాలను ఇతర అంశాలను ఎత్తిచూపడం ముమ్మాటికీ కరువు సాయాన్ని ఎగ్గొట్టడం కోసమేనని రైతులు, వ్యవసాయ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మన జిల్లాకు చెందిన పాలకులు భౌతిక కోణంలో ఆలోచించి, చర్చించి, మరోసారి కల్లుపెద్దవి చేసి చూస్తే రైతుల ఇతి బాధలు, కరువు కష్టాలు కనిపిస్తాయని జనం చర్చించుకుంటున్నారు.