ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు ఆదివారం మూడో రోజు కొనసాగాయి. దీక్షలు చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చేవరకు దీక్షలు కొనసాగిస్తామని దీక్షా బృందం స్పష్టంచేసింది. ఆందోళన తీవ్రతరం అవుతుందని, దానికి జిల్లా విద్యా శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి ఆధ్వర్యాన మహిళా విభాగం నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విజయగౌరి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు విద్యా రంగాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయని, వాటిపై విద్యార్థులు ,ఉపాధ్యాయులు కలిసి పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే ఎన్‌ఇపి పేరుతో పాఠశాలలను మూసేశారని చెప్పారు. అదే సందర్భంలో 2021లో పూర్తికావాల్సిన గిరిజన యూనివర్సిటీ నిర్మాణం ఇప్పటి వరకు కనీసం మొదలు పెట్టకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
దీక్షలకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి సమస్యల పరిష్కారం కోసం నిరవధిక దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులందరికీ మేనమామ అని చెప్పుకు తిరిగే జగన్ మోహన్ రెడ్డికి విద్యార్థుల ఆకలి కేకలు పట్టవా? అని నిలదీశారు. సమస్యలు పరిష్కరించకుంటే విద్యార్థులకు తోడుగా కార్మికులు కూడా రోడ్డెక్కాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
దీక్షకు మద్దతు తెలిపిన శ్రామిక మహిళా సంఘం నాయకురాలు బి.సుధారాణి మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థినులకు శానిటరీ నేప్‌కీన్స్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ వెంకటేష్, పి.రామ్మోహన్ మాట్లాడుతూ మూడు రోజులుగా దీక్షలు చేస్తున్నా అధికారుల నుంచి కనీసం స్పందన లేకపోవడం దారుణమన్నారు. విద్యార్థులవి ఏమీ గొంతెమ్మ కోర్కెలు కాదన్నారు.