ప్రజాశక్తి-విజయనగరం కోట : నగరంలోని విటి అగ్రహారం ఇండిస్టియల్ ఏరియాలోని ప్లాస్టిక్ కంపెనీలో వాచ్‌మేన్ శనివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. విటి అగ్రహారానికి చెందిన బంటుపల్లి అప్పలనాయుడు (71) ఓ ప్లాస్టిక్ కంపెనీలో కొంత కాలంగా వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న బీహార్ ప్రాంతానికి చెందిన కొనాల్ శనివారం రాత్రి 9:30గంటల సమయంలో మిషన్‌కు సంబంధించిన కటింగ్ బ్లేడ్లు దొంగచాటుగా విక్రయించేందుకు బయటకు పట్టుకుని వెళ్తుండగా వాచ్‌మేన్ అప్పలనాయుడు అడ్డుపడ్డాడు. దీంతో అతన్ని తీవ్రంగా కొట్టి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆయన పక్కనే ఇంకో కంపెనీలో పనిచేస్తున్న వాచ్‌మేన్‌కు విషయం చెప్పడంతో ఆయన అప్పలనాయుడు ఇంటికి ఫోన్ చేశాడు. అతని కుటుంబ సభ్యులు వచ్చి కట్టుకట్టి ఇంటికి వెళ్లిపోదామని చెప్పినా, కంపెనీ వద్ద కాపలా లేకపోతే ఎలా అని చెప్పి అక్కడే ఉండిపోయాడు. అర్ధరాత్రి కొనాల్ వచ్చి రాడ్డుతో కొట్టి అప్పలనాయుడును హతమార్చాడు. శనివారం తెల్లవారి 6గంటలకు శ్రీను అనే పనివాడు వచ్చి గేట్లు కొడుతుంటే తలుపులు తెరవకపోవడంతో గోడదూకి లోపలకు వచ్చాడు. అప్పటికే వాచ్‌మేన్ అప్పలనాయుడు రక్తపు మడుగులో ఉండడంతో వెంటనే సహోద్యుగులకు చెప్పాడు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో రూరల్ సిఐ టివి తిరుపతిరావు, ఎస్‌ఐ బి.గణేష్, గంట్యాడ ఎస్‌ఐ కిరణ్, రూరల్ ఎఎస్‌ఐ రామారావు పరిశీలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలించారు. కొనాల్ తన బ్యాగు తీసుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్లిపోతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కంపెనీ యజమానులు వచ్చి సమాధానం చెప్పాలని, అంతవరకు మృతదేహాన్ని తరలించేందుకు వీలు లేదని అప్పల నాయుడు కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు కంపెనీ యజమానులైన గౌతం, రాము ఫోన్ చేశారు. వారు అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం 6గంటల వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచారు. వారు వచ్చిన తరువాత అక్కడి నుంచి పోస్టుమార్టం కోసం తరలించేందుకు ఆస్పత్రికి తరలించారు.