Nov 20,2023 00:47

సమావేశాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా యుటిఎఫ్‌ నిరంతరం పోరాడుతోందని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి అన్నారు. ఈనెల 26న గురజాలలోని చల్లగుండ్ల గార్డెన్స్‌లో నిర్వహించే జిల్లా రెండో కౌన్సిల్‌ సమావేశాల విజయవంతం కోసం సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులు, యుటిఎఫ్‌ విధానాలు, ప్రతిపాదనలు, అధికార, ప్రతిపక్షాల తీరుపై మహాసభలో చర్చిస్తామన్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కె.ఎస్‌ లక్ష్మణరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ఎస్‌ ప్రసాద్‌, జిల్లా విద్యాశాఖ అధికారి కె.శామ్యూల్‌, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తదితరులు హాజరై ప్రసంగిస్తారన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో రాష్ట్ర విద్యా రంగంలో తీసుకు రావలసిన మార్పులకు సంబంధించి యుటిఎఫ్‌ ప్రతిపాదనలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఇటీవల విద్యా రంగంలో మార్పులు గమనిస్తే పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు ఉందన్నారు. ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మానసికక్షోభకు గురిచేసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయనని విమర్శించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆకస్మిక తనిఖీలు, ఆయన వ్యవహార శైలి పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మాట్లాడే తీరు పాఠశాలలోనే ఉపాధ్యాయుల గుండెపోటుకు గురయ్యే విధంగా ఉన్నాయన్నారు. నూతన జాతీయ విద్యా విధానం రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటి రెండు తరగతులకు పరిమితం చేసే 117 జీవో రద్దు, సిపిఎస్‌కు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాలపై సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. సిపిఎస్‌ రద్దుపై అన్ని రాజకీయ పార్టీలూ అలోచించాలన్నారు. ఈ మేరకు వారిపై ఒత్తిడి తేవాలని, అందులో భాగంగా జరిగే సమావేశాలకు ఉపాధ్యాయులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమావేశాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, సహాధ్యక్షులు ఎ.బాగేశ్వరి దేవి, ఎం.మోహన్‌రావు, కోశాధికారి జెవిడి వాల్యా నాయక్‌, నాయకులు పాల్గొన్నారు.