Nov 20,2023 21:25

విశాఖలో మత్స్యకారులతో మాట్లాడుతున్న కర్రోతు బంగార్రాజు

ప్రజాశక్తి- భోగాపురం : విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో భోగాపురం మండలంలోని మత్స్యకారులకు చెందిన 12 బోట్లు కాలిపోయాయి. మరికొన్ని పాక్షికంగా ప్రమాదానికి గురయ్యాయి. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని ముక్కాం గ్రామానికి చెందిన మూడు బోట్లు, చేపలకంచేరుకు చెందిన ఏడు బోట్లు, ఎర్రముసలయ్యపాలెం మత్స్యకారులకు చెందిన రెండు బోట్లు ప్రమాదంలో కాలిపోయినట్లు చెబుతున్నారు. చేపలకంచేరు సర్పంచ్‌ అరజల్ల నర్సింగరావుకు చెందిన రెండు బోట్లు, కారి ముసలోడు, బొడ్డు అప్పన్న, బూలోకం, మైలపల్లి గురువోజి, అరజల్ల బుడ్డోడుకు చెందిన బోట్లు ఉన్నాయి. ఒక్కో బోటు విలువ సుమారు రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. మండలంలోని మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు విశాఖ వలస వెళ్లి అక్కడ జీవనం సాగిస్తుంటారు. అప్పులు చేసి తయారు చేసిన బోట్లు ఇలా కాలిపోవడంతో భాదితులు విలపిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు, జనసేన నాయకులు లోకం మాధవి.. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. మత్స్యకారులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకొని వెంటనే శిక్షించాలని డిమాండ్‌చేశారు.
బాధితులను ఆదుకోవాలి
విజయనగరం కోట : భోగాపురం మండలానికి చెందిన 12 బోట్లు కాలిపోయిన బాధిత మత్స్యకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్‌.రమేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యంత సున్నితమైన ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రాంతంలో భద్రతాచర్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి, కారణాలు వెలికి తీయాలని డిమాండ్‌ చేశారు.