- మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు.
- భార్యకు తీవ్ర గాయాలు
మంగళగిరి రూరల్: మంగళగిరి -తాడేపల్లి కార్పోరేషన్ పరిధి కాజ టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళగిరి రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల మేరకు... విజయవాడ నగరంలోని రాణిగారి తోటకు చెందిన అంబటి ఆంజనేయులు(31) శిరీష దంపతులు కనిగిరి లోని బంధువుల వివాహానికి హాజరై శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనం పై తిరిగి విజయవాడకు బయలు దేరారు. మార్గ మధ్యలోని మంగళగిరి -తాడేపల్లి కార్పోరేషన్ పరిధి కాజ టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చే సరికి అప్పటికే రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న విజయవాడ కార్పోరేషన్ చెత్త లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆంజనేయులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా భార్య శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన శిరీషను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు ఆంజనేయులు కూల్ డ్రింక్స్ షాపు నిర్వహిస్తుండగా భార్య శిరీష బ్యాంకు మెసెంజర్ గా విధులు నిర్వహిస్తుందని, వీరికి ఇద్దరు ఆడపిల్లలు కలరని రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ తెలిపారు.