సత్తెనపల్లి రూరల్: సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సత్తెనపల్లి మండలం నందిగామ లో మిర్చి పంటలను టిడిపి నాయకులు ఆదివారం పరి శీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జలవనరుల శాఖా మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతులు గోడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ట్యాంకర్లు ద్వారా సాగునీరు పెట్టు కోవా ల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని, ఇప్పటికే మిర్చిరైతులు సుమారు లక్షరూపాయలు పెట్టారని సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. తక్షణం సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పీలా సాంబశివరావు,కోయ లక్ష్మయ్య, బడ్డారుపల్లి నరసింహారావు పాల్గొన్నారు.