ప్రజాశక్తి - కొమరాడ : వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజల చెంతకు సంక్షేమ పథకాలు అందజేసేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే పాములు పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని విక్రమపురంలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని సర్పంచ్ కళింగ శైలజ ఆధ్వర్యంలో ఆమె ప్రారంభించారు. అనంతరం సచివాలయ భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సచివాలయం బయట ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ప్రభుత్వ ఇటీవల కాలంలో విడుదల చేసిన డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అన్ని సేవలు సక్రమంగా అందించడం జరుగుతుందన్నారు. గతంలో ప్రజలు వివిధ పనుల కోసం మండల కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేసినప్పటికీ పనులు జరగక అనేక ఇబ్బందులు పడే వారిని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని అన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థతో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు ఇంటికి వస్తాయన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు పరీక్షిత్రాజ్, జెడ్పిటిసి సభ్యులు ద్వారపు రెడ్డి లక్ష్మి, ఎంపిపి శెట్టి శ్యామల, ఎంపిడిఒ ఎల్వి అప్పారావు, తహశీల్దార్ మల్లికార్జునరావు, డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ కళింగ మల్లేశ్వరరావు, మండల ఇంజనీరింగ్ అధికారి ఫణి, వైసీపీ నాయకులు జనార్ధన రావు మధుసూదన్ రావు, పిఎసిఎస్ అధ్యక్షులు ఎం.సూర్పనాయుడు, డి.శ్రీధర్, సానికొసిపి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.