Nov 19,2023 21:29

దుస్తులను పంపిణీ చేస్తున్న డిప్యూటీ స్పీకర్‌ స్వామి

ప్రజాశక్తి- కొత్తవలస : సేవా గుణం చాలా గొప్పదని సేవ చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరికీ రావాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. మండలంలోని మంగలపాలెంలోని గురుదేవా చారిటబుల్‌ ట్రస్ట్‌ 25వ వార్షికోత్సవం, గురుదేవ హాస్పిటల్స్‌ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లక్షలాది మంది వికలాంగుల ఉన్నతికి 25ఏళ్ల పాటు ట్రస్ట్‌ ద్వారా జగదీశ్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ట్రస్ట్‌కు ప్రభుత్వం ద్వారా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ట్రస్ట్‌ చేపడుతున్న సేవలకు గానూ రూ.లక్ష విరాళంగా కోలగట్ల ప్రకటించారు. గాయత్రి మెడికల్‌ కళాశాల, గాయత్రి హాస్పిటల్స్‌ సెక్రటరీ డాక్టర్‌ పి.సోమరాజు మాట్లాడుతూ గురుదేవ ట్రస్ట్‌, హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తూ జగదీష్‌ యుగ సాధకుడ య్యారని కొనియాడారు. త్వరలో ఇక్కడ నర్సింగ్‌ కళాశాలను నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. ముందుగా ట్రస్ట్‌ ప్రాంగాణంలోని అవయవ తయారీ కేంద్రాన్ని, గురుదేవ హాస్పిటల్స్‌ను కోలగట్ల సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వికలాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. వివిధ గ్రామాల్లోని భజన, కోలాటం సంఘాల మహిళలకు చీరలు, సామాగ్రిని ట్రస్టు ద్వారా అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, పిఎసిఎస్‌ చైర్మన్‌ గొరపల్లి శివ, గురుదేవ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ రాపర్తి జగదీష్‌ కుమార్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఫణీంద్ర, కొత్తవలస ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు మూర్కూరి తాత, కుంకాల పండు, విన్నకోట రాజేష్‌, గురుదేవ హాస్పిటల్స్‌ సిఇఒ డాక్టర్‌ అచ్చు రామయ్య, డాక్టర్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ ప్రియ, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ రఘువంశి, డాక్టర్‌ రామ్మోహన్‌, డాక్టర్‌ సుజాత, గురుదేవ ట్రస్ట్‌, హాస్పిటల్‌ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.