ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలలో 'ఆరంభ్' పేరుతో శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు జెఎన్‌టియు జివి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తాను ఎంచుకున్న బ్రాంచ్‌ను ఇష్టపడి, ఆ రంగంలో తనను తాను తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఇంజినీరింగ్ మొదటి రోజు నుంచి చదువు, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాఠ్యాంశాల ప్రకారం అన్ని సబ్జెక్టులను నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు సుస్థిరమైన అభివృద్ధి కోసం లోతైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని, దానిని తమ జీవితంలో అన్వయించుకోవాలని కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి మాట్లాడారు. అనంతరం ముఖ్య అతిథి ప్రొఫెసర్ వెంకటసుబ్బయ్యను సత్కరించారు. ముఖ్య అతిథి చేతుల మీదుగా రోబోటిక్స్ వర్క్‌షాప్‌కు హాజరైన అధ్యాపకులకు ప్రత్యేక గుర్తింపు, జాతీయ స్థాయి శిబిరాలకు హాజరైన ఎన్‌సిసి క్యాడెట్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు. వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, అధ్యాపకులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.