ప్రజాశక్తి-విజయనగరం : సమాజంలోని వివిధ వర్గాల స్థితిగతులను తెలుసుకోవడానికే ప్రభుత్వం కులగణను చేపడుతోందని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కుల గణన-2023పై వివిధ కుల సంఘాలు, సంస్థల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు స్థానిక డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో శనివారం జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27నుంచి జిల్లాలో అత్యంత పాదర్శకంగా, పకడ్బందీగా కుల గణన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారం రోజులపాటు సర్వే చేస్తారని చెప్పారు. మొత్తం మూడు విధాలైన వివరాలను సేకరిస్తారని తెలిపారు. దీనిపై ఇప్పటికే వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రచారాన్నిప్రారంభించామని తెలిపారు. సర్వే స్వచ్ఛందమేనని, వివరాల కోసం ఎవరినీ బలవంతం పెట్టడం గానీ, ఆధారాలను అడగడం గానీ ఉండదని స్పష్టం చేశారు. వివరాలను తెలిపిన తరువాత, ఆ కుటుంబానికి చెందిన ఎవరో ఒక వ్యక్తి వాటిని నిర్ధారిస్తూ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందని చెప్పారు. సేకరించిన వివరాలు పూర్తి గోప్యంగా, భద్రంగా ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, కులగణన ద్వారా ఆయా వర్గాల జనాభాను బట్టి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి వీలు కలుగుతుందని అన్నారు. సదస్సులో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, సిపిఒ పి.బాలాజీ, జిల్లా బిసి సంక్షేమాధికారి సందీప్, జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ నిర్మలాదేవి, సంక్షేమశాఖల అధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ నెక్కల నాయుడుబాబు, రాష్ట్ర శిష్టకరణ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కె.అనూషా పట్నాయక్, పలువురు ఛైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, కుల గణనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.