ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఈ నెల 13న తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో ఉండి అతి వేగంతో మోటారు సైకిల్ పై రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గత నెల 17న కాకినాడ రామారావుపేట తెలుగు తల్లి విగ్రహం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యాయి. మోటార్ సైకిల్‌పై వేగంగా వచ్చి ఆర్‌టిసి బస్సును ఎదురుగా ఢకొీనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకరికి తీవ్ర గాయాలవగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నేటికీ వైద్యం పొందుతున్నాడు. సెప్టెంబర్ 20న హైవే వాహనాన్ని ఒక వ్యాన్ ఢకొీట్టడంతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఇలా అనేక ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగా తరచూ జరుగుతున్నా వాహనదారులు ఎటువంటి జాగ్రత్తలూ పాటించడం లేదు. గమ్యానికి చేరుకోవాలనే తొందరపాటు వలన పలువురు శృతి మించిన వేగంతో వాహనాలను, హెల్మెట్లు లేకుండా మోటార్ సైకిళ్లను నడుపుతున్నారు. మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చి ప్రమాదాల గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకరిద్దరకు బదులు ముగ్గురు, నలుగురు బైకులపై ప్రయాణాలు చేస్తూ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢకొీట్టిన సంఘటనల్లో అనేకమంది మృతి చెందడమే కాకుండా క్షతగాత్రులుగా కూడా మిగులుతున్నారు. ఒక వైపు ప్రయాణికుల నిర్లక్ష్యం మరోవైపు ప్రభుత్వ అలసత్వం వెరసి ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు మరమ్మతులు కనీసంగా చేయడం లేదు. పెద్ద పెద్ద గుంతలతో ఎక్కడకక్కడ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఈ కారణంతోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాలకులు కనీసంగా పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సగటున 23 మరణాలు
వివిధ సందర్భాలలో కాకినాడ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నెలకు సగటున 23 మరణాలు సంభవిస్తున్నాయి. గతేడాది 808 ప్రమాదాలు జరగ్గా 338 మంది చనిపోయారు. అంటే నెలకు సగటున 28 మరణాలు సంభవించాయి. 93 ప్రమాదాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. 322 ప్రమాదాలు మరణాలకు దారితీశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 635 ప్రమాదాలు జరగగా 278 మంది మరణించారు. నెలకు సగటున 23 మరణాలు జరుగుతున్నాయి. వీటిలో 98 తీవ్ర ప్రమాదాలున్నాయి. మరణాలకు దారి తీసిన ప్రమాదాలు 253 జరిగాయి. మితిమీరిన వేగంతో 60 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్టు అంచనా. 20 శాతం మద్యం సేవించి నడపడం, 10 శాతం ఓవర్ టెక్ చేయడం వల్ల, 20 శాతం నిబంధనలకు విరుద్ధంగా నడపడం వల్ల జరుగుతున్నాయి. సుమారు 50 శాతం మరణాలు మోటార్ బైక్ ద్వారానే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. బ్లాక్ స్పాట్‌లు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎన్‌హెచ్-16, ఎన్‌హెచ్-216లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో జాతీయ రహదారుల వెంబడి వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, రంబల్ స్టిక్టర్స్ వంటివి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి. అప్రోచ్ రోడ్లపై అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. రహదారుల వెంబడి ఆక్రమణలు తొలగించాలి.