ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండల కేంద్రంలోని జిల్లా శాఖ గ్రంధాలయంలో నిర్వహిస్తున్న గ్రంధాలయ వారోత్సవాలు విద్యార్థుల ఆటల పోటీలతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవం ఈనెల 14 నుంచి 20 వరకు జాతీయ గ్రంధాలయ 56వ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి ఐదు రోజులుగా స్థానిక మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ, బాలుర ఆశ్రమ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు పలు రకాల పుస్తకాలపై అవగాహన కల్పించడంతో పాటు డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన, కుర్చీ ఆటతో పాటు పాటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఆయా పాఠశాలల, కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా ప్రతిరోజు పాల్గొని ఆటపాటలతో గ్రంథాలయంలో సందడి చేస్తున్నారు. దీంతో, స్థానిక గ్రంధాలయంలో గత ఐదు రోజుల నుంచి పండగ వాతావరణం కనిపిస్తుంది. గ్రంధాలయం అంటే దినపత్రికలు, పుస్తకాలు చదవడమే కాదు... విద్యార్థులు, చిన్నారులకు ఆట, పాటలు కూడా నిర్వహించి క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తున్నారు. దీంతో, విద్యార్థులు ఉత్సాహంగా గ్రంధాలయంలో నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో పాల్గొంటూ వారి ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థులకు గ్రంథాలయ శాఖ నుంచి బహుమతులు కూడా ప్రభుత్వం అందజేస్తుండటంతో విద్యార్థులు, చిన్నారులు మరింత ఉత్సాహంగా పాల్గొంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా గ్రంధాలయాల్లో చదువు కోవడమే కాకుండా ప్రస్తుతం ఆటల పోటీలు కూడా నిర్వహిస్తుండటంతో పెద్దవారితో పాటు విద్యార్థులు, చిన్నారులకు కూడా ఎంతో ఉపయోగ పడుతున్నాయని పలువురు అంటున్నారు. ఇటువంటి ఆటల పోటీలను నిర్వహించి విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని గ్రంథాలయ శాఖ అందించాలని విద్యార్థుల తల్లితండ్రులు, పలువురు కోరుతున్నారు.