ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఈనెల 27 నుంచి వచ్చేనెల 3వ తేదీవరకు కులగణన సర్వే నిర్వహిస్తున్నట్టు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.శేషశ్రీ తెలిపారు. గ్రామ, వార్డు సచివాయాల సిబ్బంది సహకారంతో వాలంటీర్లు ఈ సర్వేను పూర్తి చేస్తారని చెప్పారు. ప్రణాళిక శాఖతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా పరిషత్ సిఇఒ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖతో పాటు అన్ని సంక్షేమ శాఖలు భాగస్వామ్యం అవుతాయన్నారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలు తెలియజేశారు.
కులగణనలో ఏయే వివరాలు నమోదు చేస్తారు?
గతంలో ఉన్న జనగణన వివరాలను యాప్ ద్వారా వాలంటీర్లు తమతో తీసుకువెళతారు. మొత్తం 20 రకాల ప్రశ్నలతో కూడిన యాప్లో వివరాలు నమోదు చేస్తారు. కొత్తగా కులం అనే కాలం వద్ద వారి కులం నమోదు చేస్తారు. బీసీల్లో కొన్ని కులాలను మాత్రం మినహాయించాలని ప్రభుత్వం సూచించింది. కొన్ని కులాలను బీసీల నుంచి ఎస్సిల జాబితా ల్లోకి మార్చాలనే ప్రతిపా దనలు కేంద్రం పరిశీల నలో ఉండటం వల్ల వీటి వివరాలు ఇందులో నమోదు చేయరు. ప్రభుత్వం నిర్ధేశించిన మిగతా వాటిని యథాతథంగా నమోదు చేస్తారు. కులగణ నతో పాటు కుటుంబ సభ్యుల ఉద్యోగ, వ్యాపార, స్వయం ఉపాధి వివరాలు, ఇంటిలో మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు, ఎల్పిజి గ్యాస్, ఇంటి వివరాలు, వ్యవసాయ భూమి, ఇతర ఆస్తులు, ఆదాయం, పశువుల పోషణ వివరాలు కూడా నమోదు చేస్తారు. కులగణ నతో పాటు ఆర్థిక, సాంఘిక జీవన పరిస్థి తులూ నమోదవుతాయి. ఇల్లు ఏ రకం, వ్యవ సాయ భూమి ఎంత? నీటి వసతి ఉన్నభూమి ఎంత తదితర వివరాలు నమోదు చేస్తారు. నివాసం ఒకచోట, మరోచోట ఉండే వారు ప్ర స్తుత, శాశ్వత చిరునామాలూ నమోదు చేస్తాం.
సర్వేలో ఎవరి నుంచి వివరాలను అధికారికంగా తీసుకుంటారు?
కుటుంబ పెద్ద అందుబాటులో ఉండే వారి నుంచి తీసుకుంటారు. లేదా కుటుం బంలో ఇతర సభ్యులు ఎవరున్నా వారి నుంచి తీసుకుంటారు. సర్వే చేసే వారు కుటుంబ సభ్యుల నుంచి ఇకెవైసి తీసుకుంటారు. గతంలో జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను కూడా వివరాలు నమోదులో కీలకంగా ఉంటాయి. వీటి వివరాలు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలల్లో ఉన్నాయి. వీటినే ప్రమాణికంగా తీసుకుంటాం.
కులగణన సర్వే ఎప్పటికి పూర్తవుతుంది?
ఈనెల 27 నుంచి 3వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి అందరి వివరాలు నమోదు చేస్తారు. తరువాత వచ్చే నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్వేలో తప్పులు సరిదిద్దేందుకు అవకాశం కల్పించారు. 10వ తేదీ తరువాత తుది నివేదిక ప్రభుత్వానికి అందిస్తారు.
సర్వే నిర్వహణకు ఏర్పాట్లు?
ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులందరికీ వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. ఈనెల 18న కుల సంఘాలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన సర్వే జరుగుతుంది. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కూడా సిబ్బందికి శిక్షణిస్తున్నాం.